కోనరావుపేట, జూన్ 26: పేదలకు సొం తింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఇల్లు మంజూరైన మహిళా సంఘ సభ్యులకు లక్ష రుణం అందిస్తామని ప్రకటించినా.. అది ఉత్తదేనని తెలుస్తున్నది. కోనరావుపేట మండ లం కొలనూరుకు చెందిన మెరుగు రజితకు రుణం బ్యాంకులో జమ అయి ఏడు నెలలవుతున్నా.. నేటికి విడుదల చేయకపోవడంతో ఇంటి నిర్మాణం ఆగిపోయింది. ఆ సాయం కోసం ఆమె అధికారుల చుట్టూ తిరిగి తిరిగీ వేసారి పోతున్నది. బాధితుల కథనం ప్రకా రం.. కొలనూరుకు చెందిన మెరుగు వెంకటేశ్, రజిత దంపతులది నిరుపేద కుటుంబం.
వీరికి ముగ్గురు పిల్లలు. వెంకటేశ్ పేయింటర్గా, రజిత బీడీ కార్మికురాలిగా పనిచేస్తున్నది. చుట్టూ పరదాలు కట్టుకొని, వాటిపై రేకులు వేసుకొని అందులోనే నివసిస్తున్నారు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకున్న వీరికి గతేడాది మేలో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకావడంతో సంబురపడ్డారు. కానీ, చేతిలో చిల్లిగవ్వలేక నిరాశ చెందారు. స్వశక్తి మహిళా సంఘ సభ్యురాలైన ఆమెకు ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి షరతులు లేకుండా స్త్రీ నిధి ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎలాగోలా చిన్న ఇల్లయినా కట్టుకుంటే భరోసా ఉంటుందని ముందడుగు వేశారు. బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. డబ్బుల్లేక ప్లింత్ బీమ్ పూర్తి చేయలేకపోయారు. దీంతో బిల్లు రాలేదు. నిర్మాణం ఆగిపోయింది. ఇటు సం ఘం ద్వారా దరఖాస్తు చేసుకున్న రజితకు ఏడు నెలల క్రితమే లక్ష రుణం బ్యాంకు ఖాతాలో జమ అయినప్పటికీ, ఇప్పటివరకు ఆ డబ్బు రాలేదని ఆమె ఆవేదన చెందుతున్నది. రుణం మంజూరు చేయించేందుకు మహిళా సంఘం వారు రూ.2,700 తీసుకున్నారని, తర్వాత బ్యాంకు, ఐకేపీ కార్యాలయాల చుట్టూ ఏడు నెలలుగా తిప్పిస్తున్నారని వాపోయింది.
తమతోపాటు మరికొందరు మహిళా సంఘ సభ్యుల పరిస్థితి కూడా ఇదేనని తెలిపింది. ఇప్పటికే ఇల్లు లేక డేరాలో ముగ్గురు చిన్నారులతో జీవనం సాగిస్తున్నామ ని, ఇటీవల రాత్రి తన భర్త వెంకటేశ్‌ను ఎలుక కరిచిందని ఆవేదన చెందింది. ఖాతాలో రుణం విడుదల చేయకుండానే వడ్డీ పేరిట రూ.8వేల వరకు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించింది. కలెక్టర్ మేడం స్పందించి తనకు న్యాయం చేయాలని, రుణం ఇప్పించి ఆదుకోవాలని రజిత వేడుకుంటున్నది. ఈ విషయమై ఏపీఎం రాజేశంను సంప్రదించగా, రజిత విషయం తమ దృష్టికి వచ్చిందని, క్షేత్ర స్థాయిలో పరిశీలించామని చెప్పారు. సిరిసిల్ల బ్యాంక్‌కు వెళ్లి బ్యాంక్ అధికారులతో మాట్లాడామని, సమావేశం ఏర్పాటు చేసి సమస్యను వెంటనే పరిషరిస్తామన్నారు.