Cibil Score | మేడ్చల్, మే5(నమస్తే తెలంగాణ): నిరుద్యోగులు ఉపాధి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం లబ్ధిదారులను తగ్గించేందుకు కొర్రీలు పెడుతున్నది. సిబిల్ స్కోర్ చూసిన తర్వాతే రుణాలు అందజేస్తారన్న ప్రచారంతో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి గుండెలు గుభేల్మంటున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి 66,648 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి బీసీ, ఈబీసీ 37,935, ఎస్సీ 16,300, ఎస్టీ 2,196, మైనార్టీలు, క్రిస్టియన్లు 10,217 వారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను విభజించి మండల, పట్టణ, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమిటీలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, కార్పొరేషన్‌కు చెందిన అధికారితో పాటు బ్యాంక్ ఉద్యోగి కమిటీలో ఉన్నారు.
దరఖాస్తుల పరిశీలన ఇలా..
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు వర్తింపజేయలంటే ప్రధానంగా సిబిల్ స్కోర్‌ను చూడనున్నారు. గత 5 సంవత్సరాలుగా కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకున్నారా, అ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అనే విషయాలను దరఖాస్తుల పరిశీలనలో తేల్చనున్నారు. అంతకు ముందు ప్రభుత్వం నుంచి రాయితీ రుణాలు పొందితే దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పథకం ప్రారంభించిన ప్రభుత్వం అర్హులైన వారికి అందించాలని ప్రభుత్వానికి దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.