న్యూఢిల్లీ, జూన్ 29: అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ (పెన్ స్టేట్) పరిశోధకులు అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచంలోనే తొలిసారి సిలికాన్‌ను ఉపయోగించకుండా కంప్యూటర్ను తయారు చేశారు. గత అర్ధ శతాబ్దిలో సాంకేతిక పురోగతికి ఆజ్యం పోసిన సిలికాన్‌కు బదులుగా ఏదో ఒకరోజు మరో పదార్థంతో వేగంగా పనిచేసే చిన్న డివైజ్‌లను తయారు చేయడం సాధ్యమేనని నిరూపించడంలో ఈ ఆవిష్కరణ ఓ మైలురాయిగా నిలువనున్నది. ‘పెన్ స్టేట్’ నానోఫ్యాబ్రికేషన్ యూనిట్లో తయారు చేసిన ఈ కంప్యూటర్ ప్రపంచంలోనే తొలి సీఎంవోఎస్ (కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్-సెమీకండక్టర్) కంప్యూటర్‌గా నిలిచింది. కాగితమంత పలుచనైన నానో-లెవల్ టుడైమెన్షనల్ (2డీ) పదార్థాలతో తయారైన ఈ కంప్యూటర్ పనితీరును పరిశోధకులు విజయవంతంగా ప్రదర్శించారు. ‘నేచర్ జర్నల్’లో ప్రచురితమైన ఓ పత్రంలో ఈ కంప్యూటర్ విశేషాలను వివరించారు.
ఇప్పటికే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల డిజైనింగ్‌లో విరివిగా ఉపయోగిస్తున్న సీఎంవోఎస్ తక్కువ శక్తిని ఉపయోగించుకోవడంతోపాటు మరిన్ని విడిభాగాలకు చోటు కల్పిస్తుంది. ఈ ఆవిష్కరణ కేవలం సిలికాన్‌కు ప్రత్యామ్నాయాలను రూపొందించేందుకే పరిమితం కాదని, తదుపరి తరం ఎలక్ట్రానిక్స్ తయారీకి రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుందని పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం సిలికాన్‌కు బదులుగా 2డీ పదార్థాలను ఉపయోగించడం ఖాయమని, ఇవి సెన్సర్లు, మెమరీ డివైజ్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు సరికొత్త ఫంక్షనాలిటీస్ను ఆఫర్ చేస్తాయని ఈ పరిశోధన బృందానికి సారథ్యం వహించిన ‘పెన్ స్టేట్’ ఇంజినీరింగ్ సైన్స్, మెకానిక్స్ ప్రొఫెసర్ సప్తర్షి దాస్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.