అశ్వారావుపేట, మే 30 : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, వచ్చే విద్యాసంవత్సరంలోగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పట్టణంలో శనివారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. స్కూల్ నిర్మాణ పనులతోపాటు వాటి నాణ్యతను తనిఖీ చేశారు. ఆవరణలో అంతర్గత రోడ్ల నిర్మాణంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. భూ భారతి, సాదా బైనామా, భూ సర్వేపై సమీక్షించారు.
వీటిపై వచ్చిన ఫిర్యాదులు, పరిష్కార చర్యల గురించి తహసీల్దార్ కిశోర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలని, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తర్వాత మున్సిపాలిటీలోని 15వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తయిన ఇండ్ల గృహ ప్రవేశాలను జూన్ 2వ తేదీకి సిద్ధం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.
ఇంకా పనులు ప్రారంభం కాని ఇండ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. ఆయా పనులను కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ దిలీప్‌రెడ్డి, తహసీల్దార్ డి.కిశోర్, ఎంపీడీవో రామకోటారెడ్డి, డిస్కం ఏడీఈ వెంకటరత్నం, ఏఈ వెంకట్, హౌసింగ్ ఏఈ మదన్, టీడీఈడబ్ల్యూ ఐడీసీ అధికారులు సాంబయ్య, బుగ్గయ్య తదితరులు ఉన్నారు.