Revanth Reddy | హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ) : రోజుకు ఓ గంట అదనంగా పనిచేసి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే, పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. పరోక్షంగా ఆదాయం పెంచితేనే పీఆర్సీ అమలవుతుందనేలా వ్యాఖ్యలు చేశారు.
గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి 16 బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్న సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కలను సాకా రం చేసుకున్న ఉద్యోగులకు రాష్ట్ర ఆదాయం పెంచడం పెద్దకష్టం కాదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడిందని చెప్పారు. పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్న వారిని పట్టుకొనే బాధ్యత ఉద్యోగులదేనని స్పష్టంచేశారు. ఆ ఆదాయాన్ని సైతం ఉద్యోగులకే ఉపయోగిస్తామని తెలిపారు.
పీఆర్సీ విషయంలో ఉద్యోగులు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకొనే ప్రయత్నం చేయాలన్నారు. కాగా, ఆదాయం పెంచితేనే సమస్యలు పరిష్కరిస్తా అని సీఎం చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు తనను గుంపు మేస్త్రీ అని అవహేళన చేస్తారని, ఎవరు ఎలా మాట్లాడినా తాను గుంపుమేస్త్రీనే అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ప్రతిపక్షాలు దొంగల ముఠాకు గుంపు మేస్త్రీ అని విమర్శిస్తుంటే.. సీఎం మాత్రం దాన్ని ఉద్యోగులకు లింక్ చేస్తూ.. ఉద్యోగుల గుంపు అంతా తనదే అని చెప్పడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తాను మధ్యతరగతి వాడినే అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఇక గతంలో తమది పోలీసు పటేల్ కుటుంబం అని గొప్పలు చెప్పుకొన్న రేవంత్రెడ్డి.. తాజాగా తాను మధ్యతరగతి వాడినే అని మాటమార్చడం కూడా విమర్శలకు దారితీసింది.