ఆదిలాబాద్ : నిధులు, నీళ్లు, నియమకాల లక్ష్యంతో ఏర్పడ్డ బీఆర్ఎస్ ( BRS ) పదేళ్ల కాలంలో అనేక నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించి రాష్ట్రాన్ని సస్యశామలం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును అనతికాలంలోనే నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరందించి రైతన్న మొహంలో చిరునవ్వును నింపింది.
ఇందులో భాగంగానే ఆయా జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల (Irrigations Project ) పనులు చేపట్టి దాదాపు 75శాతం వరకు నాడు కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. మరికొన్ని చోట్ల 90 శాతం పనులు పూర్తికాగా మరో పదిశాతం ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి.
రెండేళ్ల తరువాత అయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన చనాక కొరాట బరాజ్ ( Chanaka Korata Barrage ) ను , 1.58 టీఎంసీ నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన సదర్మాట్ బరాజ్ ( Sadarmat Barrage ) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
చనాక బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ అయ్యింది. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపొనెంట్తో కలిపి, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుని ప్రాజెక్ట్ను మొదలు పెట్టారు.
నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే సదర్మాట్ బరాజ్ కేసీఆర్ హయాంలోనే 90శాతం ప్రాజెక్టు పూర్తయ్యాయి. కేసీఆర్ చొరవ కారణంగానే నిర్మించిన ప్రాజెక్టులు నేడు ఉపయోగంలోకి రావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.