కామారెడ్డి : కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీనిధి (14) అనే విద్యార్థిని గురువారం గుండెపోటుతో (Heart attack) మృతి చెందింది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డిలో ఉంటూ చదువుకుంటుంది.
ఉదయం పాఠశాలకు వెళ్తున్న క్రమంలో పాఠశాలకు సమీపంలో గుండెలో నొప్పిరావడంతో ఆమె సృహ కోల్పోయి కిందపడిపోయింది. పాఠశాల ఉపాధ్యాయుడు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో మరో ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ఆమెకు సీపీఆర్ (CPR) చేసిన ఫలితం లేకపోవడంతో విద్యార్థిని మృతి చెందినట్లు దృవీకరించారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని మృతి చెందడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.