New Year Resolution | కొన్ని గంటల్లో కొత్త ఏడాది రాబోతున్నది. కాలమే మారుతున్నది. మనం ఎందుకు మారకూడదని చాలామంది అనుకుంటారు. కొత్త ఏడాది రాగానే సరికొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటారు. సమతుల పోషకాహారం తీసుకోవడం, బరువు తగ్గడం లాంటి లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఈ దిశగా తమ ప్రయత్నాలను మొదట్లో ఉద్యమంలా చేస్తారు. రోజులు, వారాలు గడిచేసరికి నిరాసక్తత ప్రదర్శిస్తారు. ఇంకొన్ని రోజులయ్యాక అసలు పట్టించుకోవడమే మానేస్తారు. మళ్లీ కొత్త ఏడాదికి మళ్లీ ఇవే లక్ష్యాలు ముందుకువస్తాయి. ఈ వాయిదాల వలయాన్ని ఛేదించి ముందుకు సాగాలంటే అవసరమైన, చేయగలిగిన తీర్మానాలే ప్రతిపాదించుకోవాలి.
ఆరోగ్యం బాగుండాలంటే బాగా ప్రాసెస్ చేసిన పదార్థాల కంటే ముతక ధాన్యాలను ఎంచుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, చేపలు లాంటి వాటిలో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. వీటితో గుండెజబ్బుల ముప్పు తగ్గుతుంది. శరీర బరువు, రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. అయితే, ఒక్కసారే ఆహార విధానం మార్చడం సాధ్యం కాకపోతే నెమ్మదిగా ఒక్కొక్క పదార్థాన్ని చేర్చుకుంటూ వెళ్లాలి.
చేసే ఉద్యోగాన్ని బట్టి, లేదంటే శారీరక శ్రమ చేయని తత్వంతోనైనా చాలామంది ఒకే దగ్గర కూర్చుని గడిపేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి తక్కువగా కూర్చొని, ఎక్కువగా కదలడానికి సిద్ధం కావాలి. డెస్కు ఉద్యోగాలు చేసేవాళ్లు ప్రతి గంట తర్వాత ఐదు నిమిషాలు నడవడం మంచిది. ఉదయం నడక కూడా మంచి పరిష్కారం.
చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాలు ఊబకాయం, ఫ్యాటీ లివర్, గుండెజబ్బులు, రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం, దంతాలు పుచ్చిపోవడం వంటి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి.
శరీర ఆరోగ్యానికి నిద్ర మంచి ఔషధం. నిద్ర తగ్గితే ఎన్నో విపరిణామాలు తలెత్తుతాయి. బరువు పెరగడం, గుండెజబ్బులు, కుంగుబాటు మొదలైన సమస్యలకు నిద్రలేమి కారణం. అందువల్ల నిద్రకు ముందు స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. పడకగదిలో వెలుతురు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. కెఫీన్ ఉన్న పానీయాలు తాగకూడదు. ఏడు నుంచి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర ఆరోగ్యానికి మంచిది.
శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం అవసరం. మిగిలిన విషయాల్లాగే వ్యాయామం కూడా కొత్త ఏడాది తీర్మానాల్లో తప్పకుండా ఉంటుంది. అయితే, ప్రారంభంలో మీకు తేలికగా, హాయిగా ఉండే వ్యాయామాన్ని ఎంచుకోండి. ఓ అరగంట నడవడం, జాగింగ్, సైకిల్ తొక్కడం, ఈతకొట్టడం లాంటివి మంచి ఎంపికలు. కఠినమైన వ్యాయామాలు ఎంచుకుని మధ్యలో వదిలేయడం కంటే దీర్ఘకాలం కొనసాగించగలిగే వాటిని ఎంచుకోవడం మంచిది.
మీకంటూ కొంచెం సమయం కేటాయించుకోవడం స్వార్థం కాదు. పెద్దల బాధ్యతలు చూసుకునే స్త్రీలు, ఆరోగ్య రంగంలో పనిచేసే వారు తప్పకుండా తమ కోసం సమయం కేటాయించుకోవాలి. అలాగని మరీ ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఈ సమయాన్ని యోగా శిక్షణకు వెళ్లడం, ఆరోగ్యకరమైన ఆహారం వండుకోవడం, ఆహ్లాదకరమైన పరిసరాల్లో నడవడం, లేదంటే వారాంతంలో ఓ గంట ఎక్కువ నిద్ర పోవడానికి కేటాయించుకోవాలి. దీనివల్ల మానసికంగా సాంత్వన దొరుకుతుంది.
బయటి ఆహారం తినే వాళ్లకంటే ఇంటి దగ్గర వండుకుని తింటే ఆహారం నాణ్యత బాగుంటుంది. కొవ్వు పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయని అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి బయట తినే అలవాటు ఉన్నవాళ్లు ఇకనుంచి ఇంటివంటకు ఓటేయండి. చిరుతిండ్లు కూడా ఇంటి దగ్గరే చేసుకోవడం ఉత్తమం.
కొత్త ఏడాది సందర్భంగా… రోజూ ఆరుబయట నడవడం, వారాంతాల్లో హైకింగ్‌కు వెళ్లడం, సెలవు రోజుల్లో దోస్తులతో క్యాంప్‌కు వెళ్లడం వంటివి చేస్తామని తీర్మానించుకోండి. లేదంటే ఇంటి పెరట్లో మొక్కలు పెంచుకోవడం, లాన్‌ను అందంగా తీర్చిదిద్దుకోవడమూ మంచిపనులే. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది.
ఇప్పుడు అందరికీ స్మార్ట్ఫోన్లు సహజమైపోయాయి. టీవీలు, కంప్యూటర్లు సరేసరి. వీటితో ఎక్కువగా గడపడం.. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల కుంగుబాటు, ఆందోళన, ఒంటరితనం ఎక్కువైపోతున్నది. అందువల్ల సోషల్ మీడియా, టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్‌లు ఆడటం మొదలైన వాటిపై గడపటం తగ్గించుకోవాలని తీర్మానించుకోండి. ఇలా చేయడం మీ ఉత్పాదకతను పెంచుతుంది.
మానసిక ఆరోగ్యానికి ధ్యానం మంచి ఉపకరణం. ఆందోళన, కుంగుబాటు ఉన్నవాళ్లకు ధ్యానం మరింత మంచిది. కొత్త ఏడాదిలో ధ్యానం చేయడం మీ జీవన విధానంలో భాగం చేసుకోండి.
చాలామంది వీధి దుకాణాల్లో సులువుగా దొరికే చిప్స్, బిస్కెట్లు, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడ్డారు. ఎంత సులువుగా లభించినా, మరెంత రుచికరంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సరైన పోషకాహారం తినకుండా జంక్‌ఫుడ్ మీద ఆధారపడితే ఊబకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్నే తింటామని తీర్మానించుకోండి.
రకరకాల యాప్స్ వచ్చాక అన్ని అవసరాలనూ ఆన్లైన్ ద్వారానే తీర్చుకుంటున్నారు. అయితే, ఈ కొత్త ఏడాది మీ వీధిలో ఉండే కిరాణా దుకాణానికి నడిచి వెళ్లాలని నిర్దేశించుకోండి. మీకు కావాల్సిన సరకులు కావాల్సిన మేరకు కొనుక్కొనే వీలు ఉంటుంది. దుబారాకు అవకాశం ఉండదు. పైగా మానవ సంబంధాలకు ఆస్కారం ఉంటుంది.
మీకు ఇష్టమైన హాబీని ఎంచుకోండి. ఇది సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి దోహదపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పనుల్లో ఎంతగా తలమునకలై ఉన్నప్పటికీ మీ హాబీని కొనసాగించండి.
ఆరోగ్య సంరక్షణలో భాగంగా క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే ముదరకుండా జాగ్రత్తపడటానికి ఈ పరీక్షలు దోహదపడతాయి. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఫిజీషియన్ దగ్గరికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
నూతన సంవత్సరం సందర్భంగా నోటి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. క్రమం తప్పకుండా బ్రషింగ్, ఫ్లాసింగ్ చేసుకుంటే చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన వంటి సమస్యలు దరిచేరవు. అంతేకాదు, అల్జీమర్స్, గుండెజబ్బులు మొదలైన సమస్యలకు చిగుళ్ల వ్యాధులకు సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాబట్టి బ్రషింగ్, ఫ్లాసింగ్తోపాటు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా దంతవైద్యుడి దగ్గర పరీక్ష చేయించుకోవాలి. దంతాలను శుభ్రపర్చుకోవాలి.
కొత్త ఏడాది తీర్మానాల అమలు కొన్ని రోజులకే పరిమితం అవుతుంది. కానీ పైన వివరించిన ఆరోగ్యకరమైన అలవాట్లు మీ శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యానికి దీర్ఘకాలిక హామీని ఇస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోండి. మీ మనసు, శరీరం గురించి తగిన శ్రద్ధ చూపండి. ఈ 2025 కొత్త ఏడాదిలో మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని తీర్మానాలైనా అమల్లోపెట్టండి. జీవితాన్ని ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మలుచుకోండి.