Chiranjeevi | ప్రాణాలకు ముప్పు ఎదురైనా విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల భద్రత కోసం పోరాడిన ఆయన ధైర్యాన్ని కొనియాడుతూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా స్పందించారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో స్మిత్ మచ్చార్‌పై కో-పైలట్ కత్తితో దాడి చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చార్ ప్రస్తుతం అబుధాబిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఆయన ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడైంది.
స్మిత్ మచ్చార్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ చిరంజీవి తన సోషల్ మీడియా పోస్టులో ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం ఉన్న సమయంలోనూ తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు పోరాడటం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు.తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు పోరాడిన స్మిత్ మచ్చార్ ధైర్యాన్ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్లిష్ట పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలుసుకుని తనకు ఎంతో భావోద్వేగంగా అనిపించిందని తెలిపారు. ఆంజనేయస్వామి అనుగ్రహం స్మిత్ మచ్చార్‌పై ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఆయన ధైర్యసాహసాలకు, మానవత్వానికి హృదయపూర్వక వందనాలు తెలిపారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణలోనూ స్మిత్ మచ్చార్ ఆ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు సమాచారం. విమానంలో తనపై కత్తితో దాడి జరిగిన సమయంలో ఒకవైపు తన ప్రాణాల కోసం పోరాడుతూనే, మరోవైపు విమానంలోని ఇతరులు ప్రమాదంలో పడకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు.తీవ్రంగా గాయపడటంతో పాటు విమానం కిందికి జారిపోతున్న పరిస్థితి ఉన్నప్పటికీ తాను లేచి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించినట్లు మచ్చార్ వివరించారు. తీవ్రంగా ప్రయత్నించి కాక్‌పిట్ తలుపు తెరిచానని, ఆ తర్వాత ప్రయాణికులు పరుగెత్తుకుంటూ వచ్చి సహాయం చేయడంతో అందరినీ కాపాడగలిగామని చెప్పినట్లు తెలుస్తోంది. తాను గత 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నానని స్మిత్ మచ్చార్ తెలిపారు. అందులో 11 ఏళ్లుగా ప్రధాన పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. అనుభవం, సమయస్ఫూర్తితో పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రయాణికుల భద్రత కోసం పోరాడినట్లు ఈ ఘటన ద్వారా వెల్లడైంది.