Social Media | న్యూఢిల్లీ, మే 22: సోషల్ మీడియాలో గంటల తరబడి గడపటం.. పిల్లల్లో డిప్రెషన్ లక్షణాల్ని పెంచుతున్నదని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ముఖ్యంగా 9 నుంచి 13 ఏండ్ల పిల్లల్లో మూడేండ్ల కాలంలో సోషల్ మీడియా వాడకం రోజులో సగటున 7 నిమిషాల నుంచి 73 నిమిషాలకు పెరిగిందని, అదేవిధంగా వారిలో డిప్రెషన్ లక్షణాలు కూడా 35 శాతం పెరిగాయని ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ పరిశోధకుల అధ్యయనం పేర్కొన్నది.
దీని ప్రకారం, సోషల్‌మీడియాను అతిగా వాడుతున్న పిల్లల్లో నిరాశ, నిస్పృహ, విచారం, ఆసక్తి లేకపోవటమనే డిప్రెషన్ లక్షణాలు పెరుగుతున్నాయి. అయితే, మానసికంగా పిల్లల్లో ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయన్నది అధ్యయనం స్పష్టంగా చెప్పలేకపోయింది. తప్పనిసరై ఆన్‌లైన్‌కు అలవాటు పడటం, నిద్ర సమయం దెబ్బతినటం.. డిప్రెషన్‌ను పెంచుతుండవచ్చునని పరిశోధకులు అంచనావేశారు. పిల్లలు పరిమిత సమయం మాత్రమే సోషల్ మీడియాలో గడిపేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు.