లండన్: కౌంటీ క్రికెట్లో చతేశ్వర్ పూజారా డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న 2022 కౌంటీ ఛాంపియన్షిప్ తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చాటాడు. ససెక్స్ తరపున తొలి మ్యాచ్ ఆడిన పూజారా.. డబుల్ సెంచరీ చేయడం విశేషం. డర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో పూజారా రెండవ ఇన్నింగ్స్‌లో 201 రన్స్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే ఔటైన పూజారా.. రెండవ ఇన్నింగ్స్‌లో తన బ్యాట్‌తో అలరించాడు. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో డర్బీషైర్ 505 పరుగులు చేసింది. అయితే ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 174 రన్స్ మాత్రమే చేసింది. ఇక రెండవ ఇన్నింగ్స్‌లో పూజారా 387 బంతుల్లో 201 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ టామ్ హెయిన్స్తో కలిసి మూడవ వికెట్‌కు 351 రన్స్ జోడించాడు. హెయిన్స్ 243 రన్స్ చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో ససెక్స్ 176 ఓవర్లలో 513 రన్స్ చేసింది. దీంతో ఆ మ్యాచ్ డ్రా అయ్యింది. సరైన ఫామ్‌లో లేని పూజారాను స్వదేశంలో దక్షిణాఫ్రికా, శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లకు దూరం పెట్టిన విషయం తెలిసిందే.