బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడని అప్పుడెప్పుడో శ్రీదేవి పాడింది. ఆ ఫోనులో ఏ బూచాడూ లేడు. కానీ, సబ్బుపెట్టెలో మాత్రం.. సూపర్‌మ్యాన్, డోరేమాన్, స్పైడర్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా, యూనికార్న్, మిక్కీ మౌస్.. అబ్బో లెక్కలేనంత మంది ఉన్నారు! పిల్లలు ఇష్టపడే కామిక్ క్యారెక్టర్లను సబ్బుల్లో పెట్టి చిన్నారుల్ని స్నానానికి సన్నద్ధం చేస్తున్నాయి ‘లా సెవో’ సబ్బులు. పిల్లలకే కాదు తల్లులకూ ఇవి ఇష్టమైనవే. ఓషధులను రంగరించుకున్న ఈ సబ్బులతో ఎన్నో లాభాలు అంటున్నారు వీటి రూపకర్త అంజుమ్ ఫాతిమా. ఆమె చెబుతున్న టాయ్ సోప్ స్టోరీ తన మాటల్లోనే..
నేను మహారాష్ట్రలో పుట్టి పెరిగాను. ఎంబీఏ చదివిన తర్వాత కేర్ హాస్పిటల్స్ కార్పొరేట్ ఆఫీస్‌లో ఆడిటర్‌గా పనిచేశాను. ఉద్యోగం చేస్తున్నప్పుడే పెండ్లి అయింది. మా అత్తగారిది హైదరాబాద్. మా ఆయన, అత్తయ్య సపోర్ట్‌తో పెండ్లయ్యాక కూడా ఉద్యోగం కొనసాగించాను. అబ్బాయి పుట్టాడు. వాడు అంబాడటం మొదలుపెట్టాక, వాడిని పట్టుకోవడం మా అత్తగారికి కష్టమైంది. మావారు కార్పొరేట్ సంస్థలో పెద్ద ఉద్యోగి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుండేది. దీంతో బాబు కోసం నేను ఉద్యోగం వదులుకోక తప్పలేదు. అబ్బాయి కాస్త పెద్దయ్యాక మళ్లీ ఉద్యోగం చేయాలనుకున్నా! కానీ, మూడేండ్లకు ఇంకో బాబు పుట్టాడు. ఉద్యోగం పోస్ట్‌పోన్ చేశాను. ఎలాగూ ఖాళీగానే ఉంటున్నానని చదువుపై దృష్టిపెట్టాను. బి.ఎడ్లో చేరాను. అయిపోయాక, ఇంటి దగ్గరే ఓ కార్పొరేట్ పాఠశాలలో టీచర్‌గా చేరాను. మా పిల్లల్నీ అదే స్కూల్లో చేర్పించాను. ఇంతలో హఠాత్తుగా మా అత్తగారు కాలం చేశారు. దాంతో నా ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వక తప్పలేదు. పిల్లల్ని చూసుకోవడం, వాళ్లను చదివించడమే బాధ్యతగా మారింది.
కరోనా సమయం మనిషి దృక్పథాన్ని చాలావరకు మార్చేసింది. ఎన్నడూ లేనంతగా చాలామంది ఆర్గానిక్ ఫుడ్, హైజీన్, కెమికల్ ఫ్రీ ఉత్పత్తుల గురించి ఎక్కువగా చర్చించుకోవడం కనిపించింది. జనానికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. మంచి ఆహారం గురించి ఆలోచించసాగారు. సేంద్రియ ఉత్పత్తుల గురించి వాకబు చేయడం మొదలైంది. అయితే, కొవిడ్ ఉధృతి తగ్గాక ఆ చైతన్యం తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా కరోనాకు ముందు, తర్వాత కూడా సబ్బులు, షాంపులు, లోషన్లు, క్రీముల విషయంలో అవగాహన లేకుండా వ్యవహరించడం కనిపించింది. ఈ ఉత్పత్తుల్లో ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు, వాటివల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి మొదలైన విషయాలేవీ పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించలేదు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. నేచురల్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నా… వాటికి డిమాండ్ అంతంత మాత్రమే! సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించే కెమికల్స్ వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. చాలామంది ఈ విషయాన్ని బేఖాతరు చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా రసాయన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైన సౌందర్య సాధనాలు తీసుకురావాలని భావించాను.
మార్కెట్లో ఉన్న రసాయన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా సహజ ఉత్పత్తుల గురించి తెలుసుకున్నాను. సంప్రదాయ ఉత్పత్తుల గురించి కొంత అధ్యయనం చేశాను. మొదట ఒక ఫార్ములాతో సబ్బులు తయారుచేశాను. బంధువులు, స్నేహితులకు పంపించాను. వాళ్లు బాగున్నాయన్నారు. దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఎంఎస్ఎంఈలో ఫార్ములేషన్, ఇన్గ్రిడేషన్, బ్రాండింగ్, మార్కెటింగ్ శిక్షణ తీసుకున్నాను. సాధారణంగా మార్కెట్లో ఉండే సబ్బుల్లో సల్ఫైట్, పారాబెన్ రసాయనాలు ఉంటాయి. మేం వాటికి ప్రత్యామ్నాయంగా వేపాకు, అలోవెరా, పొప్పడి, పసుపు, బొగ్గుపొడి, ముల్తానీ మట్టిని సబ్బుల తయారీకి ఉపయోగిస్తాం. ఈ సబ్బుల్ని ‘లా సెవో’ బ్రాండ్ పేరుతో ఒక ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తే మంచి స్పందన వచ్చింది!
రసాయనాలు లేని సబ్బులపై పెద్దలకు అవగాహన ఉండటంతో వాడతారు. కానీ, పిల్లలు.. సబ్బు అంటేనే అమ్మో వద్దంటారు. చేతులు కడుక్కోవడానికి బద్ధకిస్తారు. స్నానానికి మారాం చేస్తారు. బతిమిలాడినా వినరు. బెదిరిస్తే మొండికేస్తారు. అలాంటి చిన్నారులూ సబ్బును ఇష్టంగా చేతిలోకి తీసుకునే ఉపాయం టాయ్ సోప్. పిల్లలు హ్యాపీగా రుద్దుకుంటారు. ఎందుకంటే.. ఆ సబ్బులో ఉన్న బొమ్మ కోసం స్నానం చేయాల్సిందే. సబ్బు అరగ దీయాల్సిందే. చేతిలో సబ్బు అరిగిపోతేనే చేతికి పట్టిన మురికి వదిలి, ఇష్టమైన టాయ్ చేతికి చిక్కుతుంది! రసాయనాలు లేని సబ్బుల్లో వాడే టాయ్స్ వల్ల కూడా ఏ హానీ ఉండకూడదనుకున్నాం. ప్రామాణికమైన ప్లాస్టిక్‌తో తయారుచేసిన టాయ్స్నే ఎంచుకున్నాం. పిల్లలకు ఇష్టమైన కామిక్ క్యారెక్టర్ సబ్బులు కావాలని పేరెంట్స్ ఆర్డర్ చేస్తున్నారు. నాకు మార్కెటింగ్ చేయడానికి అంతగా ఆర్థిక వనరులు లేవు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ mamretails ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాను. హైదరాబాద్ నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. పుట్టినరోజు గిఫ్ట్స్ కోసం బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి. వాటిని ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తాను. లోకల్‌గా అయితే రాపిడో ద్వారా డెలివరీ ఇస్తున్నాను. సీమంతానికి కూడా ఈ రసాయనాలు లేని సబ్బులు కావాలని వస్తున్నారు. పిల్లల పాదముద్రల్లా, ఆటబొమ్మల్లా, చంటిబిడ్డలకు పాలు తాగించే పాలసీసా, ఉగ్గు తినిపించే పాత్రల్లా ఉన్న సబ్బులు కావాలని అడుగుతున్నారు. కడుపులో కదిలే బిడ్డను తాకుతూ స్నానం చేసే గర్భిణులు మరింత సంతోషంగా ఆ రోజులు గడిపేందుకు ఈ టాయ్ సోప్స్ ఉపయోగిస్తున్నారు.
హైదరాబాద్, విద్యానగర్‌లోని మా ఇంటిలోనే రెండు గదుల్ని ఈ కుటీర పరిశ్రమ కోసం ఉపయోగిస్తున్నాను. ‘మామ్ రిటైల్స్’ పేరుతో చిన్న పరిశ్రమను స్థాపించాను. నేను, ఆయన ఉద్యోగాలు చేసి, కూడబెట్టిన డబ్బుతోనే ఈ సబ్బుల తయారీ మొదలుపెట్టాను. ఆరు నెలల తర్వాత ఫేస్‌ప్యాక్, లిప్‌బామ్ తయారుచేశాను. వ్యాపార అభివృద్ధికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ద్వారా కొంత ఆర్థిక సహాయం అందింది. అలా రెండేండ్ల కిందట కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఎంఎస్ఎంఈ, సఫా ఇండియా, వి హబ్ సహకారంతో మా వ్యాపారాన్ని అభివృద్ధి బాట పట్టించాను. ఇప్పుడు రసాయనాలు లేని సబ్బులు, క్రీములు, లోషన్లు, షాంపులు తయారు చేస్తున్నాను. మొత్తం ఆరు కేటగిరీల్లో ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకువచ్చాను. కొద్ది పెట్టుబడే అయినా మంచి ఉత్పత్తి కావడంతో నాకు గుర్తింపుతోపాటు మా ఉత్పత్తులకు ఆదరణ వచ్చింది.