‘చందమామ’ పత్రిక పేరు వినగానే నిన్నటితరం తెలుగు పిల్లలకే కాదు పెద్దలకు కూడా అనేక జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అది ‘చందమామ’ గొప్ప తనం. పదమూడు భారతీయ భాషలతో పాటు కొంతకాలం సింహళ భాషలో, గిరిజన భాష అయిన ‘సంతాలి’లో కూడా చందమామ అచ్చయ్యింది. మూతపడేనాటికి దాదాపు రెండు లక్షల సర్క్యులేషన్ ఉండేదంటే పిల్లల్లో ఆ పత్రికకున్న ఆదరణ ఎంతటిదో తెలుస్తుంది.
‘చందమామ’ చదివిన పాఠకులకు దాసరి సుబ్రహ్మణ్యం, విద్వాన్ విశ్వం, ఎ.పి.సర్కార్, ఉత్పల సత్యనారాయణాచార్య మొదలగువారితో పాటు వసుంధర, గంగిశెట్టి శివకుమార్, మాచిరాజు కామేశ్వరరావు. టి.గురురామప్రసాద్ వంటి ఎంతోమంది బాల సాహిత్యకారుల పేర్లు గుర్తుకొస్తాయి. ‘వసుంధర’ ఒక్కరే దాదాపు ఏడువందల కథలు చందమామ కోసం రాశారు. వీరితోపాటు ‘చందమామ’లో యాభై కి పైగా కథలు రాసి ప్రచారానికి దూరంగా ఉన్న రచయిత బూర్లె నాగేశ్వరరావు. ఇటీవల ‘తెలంగాణలో బాల సాహిత్య వికాసం’ కోసం విషయ సేకరణ చేస్తున్నప్పుడు బూర్లె నాగేశ్వరరావు గురించిన సమాచారం, అచ్చయిన పుస్తకాలు దొరుకుతాయేమోనని బంగా రు రామాచారితో ప్రస్తావించాను. వెంటనే ‘వివరాలెందుకు నేరుగా ఆ మనిషితోనే మాట్లాడిస్తా’ అన్నారు. అదే రోజు సాయంత్రం కోదాడలో నివాసం ఉంటున్న బూర్లె నాగేశ్వరరావుతో తనివితీరా మాట్లాడాను. తనను తొలుత ప్రోత్సహించిన కొడవటిగంటి కుటుంబరావు నుంచి తనతో కలిసి రాసిన గంగిశెట్టి, మాచిరాజు వంటివారి గురించి విలువైన విషయాలు చెప్పారాయన.
బూర్లె నాగేశ్వరరావు పుట్టింది ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం గ్రామం. 1948 మార్చి 3న పుట్టిన బూర్లె 9వ తరగతి వరకు చదువుకొని, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేశారు. కుటుంబ పోషణ కోసం కొంతకాలం ఇల్లెందు దగ్గరి కామేపల్లిలో ఉన్న వీరు, ప్రస్తుతం నల్లగొండ జిల్లా కోదాడలో ఉంటున్నారు. 75 ఏండ్ల వయసులో ఇప్పుడు కూడా కిరాణ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న సహధర్మచారిణికి సేవలు చేస్తూ రచయితగానే కాక వ్యక్తిగా కూడా మన పిల్లలకు, పెద్దలకు చక్కని ఆదర్శాన్ని పంచుతున్నారు.
బూర్లె నాగేశ్వరరావు పరిచయం తర్వాత వారి కథలను పుస్తకంగా తేవాలనే మా సంకల్పం తెలి పాం. అప్పటికే వారు ఎక్కువ కథలను సేకరించి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఫోన్ చేసి శుభవార్త చెప్పారు. విజయవాడలోని జె.పి.పబ్లికేషన్స్ ప్రసాద్, శ్రీనివాసులు వీరి 45 కథలను రం గుల బొమ్మలతో అచ్చువేస్తున్నారని, వసుంధర కథలు అప్పటికే మూడు సంపుటాలు వచ్చాయని చెప్పారు. మళ్ళీ మన చేతుల్లోకి చందమామ రావడం సంతోషంగా ఉంది.
బూర్లె తొలి కథ ‘గుమ్మడికాయల దొంగ’ 1972 మార్చి చందమామలో అచ్చయ్యింది. ఆ జ్ఞాపకాలను ఆయన ఇలా వివరించారు. ‘నాకు తెలిసినప్పటి నుంచి నేనూ అందరిలాగే చందమామ అభిమానిని. నాకు ‘చందమామ’ 50 పైసల ధర ఉన్నప్పటి నుంచి తెలుసు. అయినా కొనడానికి కష్టమే. ఎలాగోకొని ప్రతి నెలా చందమామ చదివేవాడిని. ఆ క్రమంలో నేను కూడా కథలు ఎం దుకు రాయకూడదు అనుకున్నాను. తొలికథ రాసి చందమామకు పంపించాను. వెంటనే మీ కథను అచ్చువేస్తున్నామని సమాధానం వచ్చింది. చందమామ సంపాదకులు కొడవటిగంటి కుటుంబరావు కథారచనలో మెలకువలు తెలిపారు’.
బూర్లె కథలన్నీ చందమామ కోసం రాసినవి కాబట్టి అన్నీ జానపద శైలిలో సాగాయి. అయితే ఒక్కో కథలో ఒక్కో కొత్త విషయాన్ని లేదా ముగింపును చెప్పడం వీరి చూడవచ్చు. ఇటువంటిదే మరో మంచికథ ‘దెయ్యాల చెరువు’. భార్య అంటే ప్రేమ ఉన్న భర్త నేపథ్యంగా సాగుతుంది. మనకు చందమామ కథలనగానే ఎత్తులకు పైఎత్తులు వేసేవాళ్లు, మోసాన్ని బుద్ధి కుశలతతో జయించేవాళ్లు, గుణపాఠం నేర్చుకొని బాగుపడేవాళ్లు, అత్యాశకు పోయి భంగపడి బుద్ధి తెచ్చుకున్నవాళ్ళు ఇలా అనేకమంది, వివిధ విలక్షణ మనస్తత్వాలు, వ్యక్తిత్వాలతో కనిపిస్తారు. బూర్లె కథల్లో కూడా వీళ్లందరూ కథ కథకూ తారసపడతారు. ఓ అనుమానపు యజమాని తన వద్ద పనిచేసే గుమాస్తాలను అనుమానించి చివరికి వాళ్లందరిని ఎలా దూరం చేసుకున్నాడన్న విషయాన్ని తెలిపే కథ ‘అనుమానం మనిషి’ కథ. ‘అపనమ్మకం’ కూడా ఇలాగే తన సేవకుణ్ణి అనుమానించే వజ్రాల వ్యాపారి కథ. కాగా ఇందులో పనివాడి నిజాయితీతో కనువిప్పు కలిగిన యజమాని అతడిని అభిమానించడం ముగింపు.
ఇంకా.. ‘అంతరంగికుడు’, ‘చిన్నడి యుక్తి’, ‘పాపపుణ్యాలు’, ‘దొంగ కొడుకు’, ‘పరోపకారి చిన్నడు’, ‘ప్రాణం మీదికి వచ్చిన విద్య’, ‘అధర్మ సత్రం’, ‘అంబపలికింది’, ‘స్నేహం కాని స్నేహం’, ‘స్వర్గానికి దారి’, ‘రాక్షసుడి బెడద’, ‘పిశాచి నాటకం’ వంటి కథల కథకునిగా బూర్లె నాగేశ్వరరావు కథను నడిపే పద్ధతికి, సంభాషణలు నడిపించడంలో, పాత్రలను రూపుదిద్దడంలోని నేర్పును, గ్రామీణ జీవితాలు, అక్కడి జీవితాల్లో విలువలకే ప్రాధాన్యాన్నిచ్చి బతికిన మనుషులు, మానవీయ విలువలను గురించి తెలుపుతాయి.
మనకు చందమామ అనగానే గుర్తొచ్చే మరో ప్రధానమైన విషయం ‘భేతాళ కథలు. బూర్లె నాగేశ్వరరావు కూడా ఈ కథలు రాశారు. ‘పేదవాడి బింకం’, ‘మారిన మనసు’, ‘తండ్రికి తగిన కొడుకు’, ‘బతికున్న పిశాచాలు’, ‘ముగ్గురు విలుకాళ్ళు’, ‘అలౌకిక సుందరి’, ‘వ్యర్థమైన పరీక్ష’, ‘ఒక్కనాటి స్వర్గం’, ‘అరణ్యకుడు’, ‘తండ్రికి తగనివాడు’ మొదలగు పది కథలు వీరి భేతాళ కథలు. నిజానికి అన్నీ భుజంపై శవంతో, చెట్టుతో మొదలైనా ఒక కథకు మరో కథతో సంబంధం ఉండదు. దేనికదే స్వతంత్రంగా సాగుతుంది.
జీవితంలోని వివిధ కోణాలను, విభిన్న పార్శ్వా లు, దృక్కోణాలను చక్కని కథలుగా మలచిన బూర్లె తెలంగాణ జీవాత్మ అయిన సబ్బండ వర్ణ సంస్కృతి నుంచి ఎదిగారు. అన్నింటికి మించి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చిన్న చిన్న ఊర్లలో, టౌన్లలో పట్నవాసానికి దూరంగా ఉన్నారు. ఆయ న కథల్లో ఇవన్నీ కనిపిస్తాయి. ఆయన కథకుడే కాదు చక్కని చిత్రకారుడు కూడా. ఆయన వేసిన బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతుంది.
‘యాభై కాంతుల చందమామ’ బూర్లె నాగేశ్వరరావు కథలు తెలుగు బాల సాహిత్య కిరీటంలో కలికితురాయిలా మెరుస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. తెలంగాణ నేలపై నుండి వెలుగుల కథలను అందించిన బూర్లె నాగేశ్వరరావు జయహో!
జీవితంలోని వివిధ కోణాలను, విభిన్న పార్శ్వాలు, దృక్కోణాలను చక్కని కథలుగా మలచిన బూర్లె తెలంగాణ జీవాత్మ అయిన సబ్బండ వర్ణ సంస్కృతి నుంచి ఎదిగారు. అన్నింటికి మించి గ్రామీణ ప్రాంతం
నుంచి వచ్చి చిన్న చిన్న ఊర్లలో, టౌన్లలో పట్నవాసానికి దూరంగా ఉన్నారు. ఆయన కథల్లో ఇవన్నీ కనిపిస్తాయి. ఆయన కథకుడే కాదు చక్కని చిత్రకారుడు కూడా.
తెలంగాణ ప్రజలకు భాష ఓ పిలుపు మాత్రమే కాదు. చరిత్ర మారినా చెదరని అస్తిత్వం. అందుకే తెలంగాణ ఘన సాహిత్యానికి పెద్దపీట వేస్తూ చెలిమెను నిర్వహిస్తున్నది మన పత్రిక. అలసిసొలసిన వేళల్లో కళారూపాలైనా, పోరుబాటల్లో పాటలా మారినా, ఆత్మగౌరవాన్ని కథతో నినదించినా… తనదైన శైలి తెలంగాణది. ఆ సాహిత్యంలో మీకు ఎలాంటి అభిరుచి ఉన్నా, కలాన్ని కదిలించండి. ఆసక్తిగా, సూటిగా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన రచనలు చేయండి…