Surya Be Positive | కాళీ క్రాఫ్ట్స్ మరియు నిర్మలం డ్రామాస్ బ్యానర్లపై సుబ్బా మాధవరపు దర్శకత్వంలో రూపొందిన “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు కౌశిక్ పెగల్లపాటి (కిష్కింధపురి ఫేమ్), మురళీకాంత్ దేవసోత్ (దండోరా ఫేమ్) ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. చరణ్ పీసర్ల హీరోగా నటిస్తూ డైలాగ్స్ రాయడంలోనూ పాలుపంచుకున్న ఈ చిత్రంలో యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
టీజర్ ఆవిష్కరణ అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన మురళీకాంత్ దేవసోత్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఒక సినిమాను నిర్మించడం ఎంత కష్టమో తనకు తెలుసని, అమెరికాలో ఉద్యోగం చేస్తూనే సుబ్బా మాధవరపు ఇక్కడికి వచ్చి పట్టుదలతో ఈ సినిమాను పూర్తి చేయడం అభినందనీయమని కొనియాడారు. టీజర్‌లోని విజువల్స్, నటీనటుల ప్రతిభ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరో అతిథి కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ, చరణ్ తనకు కాలేజీ జూనియర్ అని, హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపన అతనిలో బలంగా ఉందని అన్నారు. టీజర్ ఎడిటింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉందని, ఒక సామాన్యుడి కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న తీరు ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో చరణ్ పీసర్ల తన ప్రసంగంలో ఉద్వేగానికి లోనయ్యారు. గతంలో మూడు సినిమాలు చేసినా అవి విడుదల కాలేదని, ఈ నాలుగవ ప్రయత్నం ద్వారా నటుడిగా ప్రేక్షకుల నుంచి అర్హతను ఆశిస్తున్నానని తెలిపారు. అవమానాలను సత్కారాలుగా మార్చుకుంటానని, తనను ఆదరించాలని కోరారు. అలాగే దర్శకుడు అమెరికాలో ఉంటూనే సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించారని, నిర్మాత తనపై నమ్మకంతో భారీ వ్యయాన్ని భరించారని కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు రోహిత్ సత్యన్ మాట్లాడుతూ, 2017 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఈ సినిమా వల్లే మొదటిసారి స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నానని, ఇందులో తన వయసుకు మించిన సవాలుతో కూడిన పాత్ర చేశానని చెప్పారు. నటి సుజాత దీక్షిత్ మాట్లాడుతూ, తన నిజస్వరూపానికి భిన్నంగా ఈ చిత్రంలో నిశ్శబ్దంగా ఉంటూ కళ్ళతో పలికించే పాత్రను దర్శకుడు తనతో చేయించారని తెలిపారు. హీరోయిన్లు యానీ డయానా, దివ్య విశ్వకర్మ తమకు తెలుగు రాకపోయినా చిత్ర బృందం ఎంతో సహకరించిందని, ఇదొక మంచి అనుభూతిని ఇచ్చిందని అన్నారు. బలగం సత్య, లిరిసిస్ట్ రాంబాబు గోసాల కూడా చిత్ర విజయానికి తమ ఆకాంక్షలను తెలియజేశారు. అరుణ్ కుమార్ పర్వతనేని ఛాయాగ్రహణం, గ్యాని సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఈ వైవిధ్యమైన చిత్రానికి సుబ్బా మాధవరపు దర్శకత్వం వహించగా, మురళీకృష్ణ మన్యం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది.