హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిషారంలో ఉద్యోగ సంఘాల జేఏసీ విఫలమైందని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీఏలు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ పునరుద్ధరణ, ఈహెచ్ఎస్ సమస్యలు తదితర అనేక అంశాలు ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. వీటి పరిషారానికి స్పష్టమైన కార్యాచరణ లేకుండా కాలయాపన చేయడం సమంజసం కాదని విమర్శించారు.
ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పడం కాదని, ప్రతి సమస్యకూ కాలపరిమితితో కూడిన స్పష్టమైన హామీ, కార్యాచరణ ప్రణాళిక, సాధించిన ఫలితాలను ఉద్యోగుల ముందుంచాలని డిమాండ్ చేశారు. ‘దసరాకు డీఏ.. దశాబ్దానికి పీఆర్సీ’ అనే పరిస్థితి ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నదని ధ్వజమెత్తారు. ఈహెచ్ఎస్ విషయంలోనూ ఉద్యోగుల ప్రయోజనాలపై స్పష్టతనివ్వాలని కోరారు. వెంటనే భవిష్యత్ కార్యాచరణతో స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే జేఏసీ రద్దు చేసి, ప్రత్యక్ష పోరాటాలకు దిగి నిజాయితీని నిరూపించుకోవాలని చంద్రశేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు.