అమరావతి : రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ అధ్యక్షు డు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ఆరోపిం చారు. అంకెలగారడీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ట్విటర్లో విమర్శించారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు.
మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల కూటమి పాలన పలుమార్లు రుజువు చేసిందని పేర్కొన్నారు. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు ఆందోళన చేస్తే ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటలబీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచారని వెల్లడించారు. తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే, వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు అడ్డం పడడం వల్ల దాదాపుగా 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000లు ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఇప్పటికైనా డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణ చర్యలు మొదలు పెట్టాలని చంద్రబాబుకు సూచించారు.