Challa Srinivasulu Setty | న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్య బాధ్యతలను తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి స్వీకరించారు. ఎస్బీఐ చైర్మన్‌గా మంగళవారం సాయంత్రం దినేశ్ ఖారా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో బుధవారం ఆయన స్థానంలోకి శ్రీనివాసులు శెట్టి వచ్చారు. ఎస్బీఐని అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా నిలుపుతామని, మరిన్ని లాభాలను సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తన సందేశంలో శెట్టి పేర్కొన్నారు. బ్యాంక్ 50 కోట్లకుపైగా కస్టమర్లకు సేవలందిస్తుండటం గర్వకారణమన్నారు. గడిచిన దశాబ్ద కాలంలో మార్కెట్ విలువపరంగా ఎస్బీఐ 17 స్థానాలు ఎగబాకి 35వ స్థానానికి చేరినట్టు గుర్తుచేశారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఎస్బీఐ లాభం 22 శాతం వృద్ధితో రూ.61,077 కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే. కాగా, ఎస్బీఐకి శెట్టి 27వ చైర్మన్. 1965 సెప్టెంబర్ 26న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా (ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లా)లోగల పెద్దపోతులపాడు గ్రామంలో ఆయన జన్మించారు.
36 ఏండ్లుగా..
ఎస్బీఐలో శ్రీనివాసులు శెట్టి దాదాపు 36 ఏండ్లుగా కొనసాగుతున్నారు. అగ్రికల్చర్లో బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్‌ను అభ్యసించిన శెట్టి.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్. ఇక 1988లో ఎస్బీఐ బరోడా శాఖలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా శెట్టి బ్యాంకింగ్ కెరియర్ను ప్రారంభించారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇలా ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థాయికి వచ్చారు. ఈ క్రమంలోనే ఎస్బీఐ ఎండీల్లో సీనియర్‌గా ఉండటంతో శ్రీనివాసులు శెట్టి చేతికే ఇప్పుడు బ్యాంక్ పగ్గాలు దక్కాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు టాస్క్ ఫోర్స్‌లు/కమిటీలకూ ఈయన నేతృత్వం వహించారు. ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ పోర్ట్ఫోలియోలనూ చూశారు.
విశేష అనుభవం
గడిచిన మూడున్నర దశాబ్దాలకుపైగా కాలంలో ప్రతీ విభాగంలో తన నైపుణ్యం, ప్రతిభలతో శెట్టి మెప్పించారు. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, డెవలప్డ్ మార్కెట్ల బ్యాంకింగ్‌లలో విశేష అనుభవాన్ని గడించారు. స్ట్రెస్డ్ అసెట్స్ రిజల్యూషన్ గ్రూప్ డిప్యూటీ ఎండీగా, కార్పొరేట్ అకౌంట్స్ గ్రూప్‌లో జీఎం-సీజీఎంగా, ఇండోర్‌లోని కమర్షియల్ బ్రాంచ్‌లో డిప్యూటీ జీఎంగా, న్యూయార్క్ ఎస్బీఐ శాఖ ఉపాధ్యక్షుడు, అందులోని సిండికేషన్స్ అధిపతిగా విధులు నిర్వర్తించారు. దీంతో శెట్టి ఆధ్వర్యంలో ఎస్బీఐ మరింత పురోగమించగలదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయిప్పుడు.