ఆర్థిక సర్వే నివేదిక చదివితే- ఒక ప్రముఖ సినీనటుడి డైలాగ్ గుర్తుకు వస్తుంది- ‘చూడు ఒక వైపే చూడు- ఇంకో వైపు చూడకు. తట్టుకోలేవు..’ అన్నట్లుగా ఉంది ఈ నివేదిక.
ముఖ్య ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం పదవీ కాలం 2021 డిసెంబర్ 7న పూర్తి అయినప్పటికీ, ప్రస్తుత సీఈఏ అనంత నాగేశ్వరన్‌ను 2022 జనవరి 28, అంటే ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశ పెట్టటానికి రెండు రోజుల ముందే నియమించడం, ఇంత ముఖ్యమైన నివేదిక తయారీలో కేంద్రం అలసత్వం తేటతెల్లమవుతుంది. ఆర్థిక సర్వే ప్రవేశ పెట్టే వరకు సీఈఏ పదవీ కాలాన్ని పొడిగించడం లేదా కొత్త వారిని ఇంకా ముందే నియమించటం ఆనవాయితీ. కానీ ఇలాంటి ఏర్పాటు జరుగకుండానే ఆర్థిక సర్వేను కేంద్రం సిద్ధం చేయడం గమనార్హం.
2021-22 ఆర్థిక సర్వే ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో 9.2 శాతం వృద్ధి ఉండవచ్చు. ఇదే విధంగా 2022-23లో 8 నుంచి 8.5 శాతం ఉండవచ్చని అభిప్రాయపడింది. కేంద్రం కరోనా సమయంలో సరఫరా వైపు సంస్కరణలు చేసింది తప్ప డిమాండ్ వైపు చేయలేదని ఇది దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఈ నివేదిక అభిప్రాయపడింది. క్యాపిటల్ వ్యయం 13.5 శాతం పెరిగిందని, ఫారెక్స్ నిలువలు 31 డిసెంబర్ నాటికి 633.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, రెవెన్యూ రాబడి పెరుగుతోందని అందువలన ఒక సుస్థిర ఆర్థిక వ్యవస్థ వైపు 2022-23 ఆర్థిక సంవత్సరం అడుగులు వేస్తోందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. సామాజిక సేవా వ్యయం 2014-15లో జీడీపీలో 6.5 శాతం ఉండగా అది 2020-21కి 8.6 శాతానికి చేరుకుందని, ఉపాధి కల్పన కరోనా కాలానికి ముందు స్థాయికి వెళ్లిందని తెలియచేసింది. వినియోగ ధరల సూచిక ప్రకారం ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉందని, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తక్కువగా 2.9 శాతం నమోదైందని తెలిపారు. కేంద్రప్రభుత్వం సరఫరా సరిగ్గా ఉండేట్లు చేయడం వలన ధరలను నియంత్రించింది అని చెప్పుకొచ్చింది. రైల్వే రహదారి రంగాల్లో రోడ్లలో క్యాపిటల్ వ్యయాన్ని ఎన్నో రెట్లు పెంచామని ప్రభుత్వం ఆర్థిక సర్వే ద్వారా చెప్పుకున్నది. సుస్థిరాభివృద్ధి స్కోరు 60 నుంచి 66కు పెరిగిందని, ఇది ఒక సుస్థిర అభివృద్ధికి చిహ్నం అని అభిప్రాయపడింది.
ఆర్థిక సర్వే ప్రకారం కేంద్ర ప్రభుత్వం అప్పులు 2014-15లో 58.66 లక్షల కోట్లు కాగా, 2020-21 నాటికి 117.04 లక్షల కోట్లకు ఎగ బాకాయి. అంటే సుమారు ఏడేండ్ల కాలంలో మోదీ ప్రభుత్వం సుమారు 60 లక్షల కోట్లు అప్పు చేసింది. రుణ- స్థూల దేశీయోత్పత్తి నిష్పత్తి 2014-15 లో సుమారు 46 శాతం ఉండగా, 2020-21కి 59.3 శాతానికి పెరిగింది. హోల్‌సేల్ ధరల సూచిక (డబ్ల్యుపీఐ) 12.5 శాతం ఉండగా వినియోగ ధరల సూచిక (సీపీఐ)5.3 శాతంగా ఉంది. సీపీఐ ప్రజల కొనుగోలు ప్రవర్తనను, కొనుగోలు ద్రవ్యోల్బణంను తెలియచేస్తే, డబ్ల్యుపీఐ హోల్‌సేల్ వ్యాపార ద్రవ్యోల్బణంను తెలియచేస్తోంది. ఆర్థిక వేత్తలు ఈ డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం కాలక్రమేణా సీపీఐ ద్రవ్యోల్బణానికి కారణం కావొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే సామాన్య జనాలపై అధిక ధరల భారం పడుతుంది.
ఆహార సబ్సిడీ పెరుగడంలోని జుమ్లాను ఈ నివేదిక బయటపెట్టింది. 2016 అనంతరం ఎఫ్‌సీఐ తీసుకున్న రుణాలు తీర్చడానికి 2020-21లో సుమారు 3.5 లక్షల కోట్లు వినియోగించినట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తున్నది. ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్యాకేజీ నిధులను పాత బకాయిలు తీర్చడానికి కేటాయించినట్టు ఈ నివేదిక ద్వారా బయటపడింది. ఇదొక జుమ్లా!
ఇండస్ట్రీ జీవీఏ 2014-15లో సుమారు 30 శాతం ఉండగా, అది 2019 నాటికే 27 శాతానికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే కరోనా కంటే ముందే, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టాండ్ అప్ ఇండియా’ ఒక పెద్ద జుమ్లాగా నిలిచింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రభుత్వం కాపాడిందని ఆర్థిక సర్వేలో చెప్పుకున్నది. కానీ జాతీయ చిన్న పరిశ్రమల సర్వే ప్రకారం తొమ్మిది శాతం చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని డిసెంబర్ 2021లో వెల్లడైంది! జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కరోనా సమయంలో ఉపాధి కల్పించామని ఆర్థిక సర్వేలో కేంద్రం గొప్పగా చెప్పుకున్నది. కానీ ఈ పథకం 70 ఏండ్ల భారతదేశ వైఫల్యానికి నిదర్శనం అని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్రధాని వాక్యాలు మరచిపోయారా?
ఉద్యోగ అవకాశాల్లో కరోనా కంటే ముందు నాటి స్థితికి వచ్చేశామని ఆర్థిక సర్వే చెబుతున్నది. కానీ ‘చిన్న మధ్యతరహా పరిశ్రమలలో కోల్పోయిన ఉద్యోగాల గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవు’ అని 2021 నవంబర్ 30న సంబంధిత మంత్రి నారాయణ్ రాణే స్వయంగా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు! ఎవరు ఒప్పు, కేంద్ర మంత్రివర్యులా, ఆర్థిక సర్వేనా? సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించిన డిసెంబర్ 2021 నాటి గణాంకాల ప్రకారం- 2019-20 తో పోలిస్తే – దేశం 29 లక్షల ఉద్యోగాలను కోల్పోయింది. ఇటువంటి పరస్పర విరుద్ధ గణాంకాలు ఏ విధంగా బడ్జెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయో ఆ భగవంతునికే తెలియాలి! -పెండ్యాల మంగళాదేవి