వికారాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిలను నిర్మించాలని పలుసార్లు విన్నవించినా ఫలితం లేదు. దీంతో నిత్యం వాహ నదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు 15 రైల్వే వంతెనలను మంజూరు చేయాలని కొన్నేండ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జికి కూడా నిధులు మంజూరు కాలేదు. వికారాబాద్ పట్టణంలో తాండూరు వెళ్లే మార్గంలో, రామయ్యగూడ, గంగారం వద్ద.. తాండూరు పట్టణంలో పాత తాండూరుతోపాటు మరో రెండు చోట్ల.. అలాగే ధారూ రు వద్ద, తరిగోపుల వద్ద, మర్పల్లి వద్ద, మొరంగపల్లి వద్ద, గేటువనంపల్లి వద్ద.. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్రంతోపా టు పలు చోట్ల రైల్వే బ్రిడ్జిలను నిర్మించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
రైల్వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయాలన్న ప్రతిసారీ సర్వేలు చేసి వదిలేస్తున్నారు. ఏండ్లు గడిచినా రైల్వే వంతెనల నిర్మా ణం మాత్రం ముందుకు సాగడంలేదు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో మోదీ ప్రభుత్వం సర్వేలతోనే కాలయాపన చేస్తున్నదని జిల్లావాసులు మండిపడుతున్నారు. బ్రిడ్జిలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో వికారాబాద్ సమీపంలోని కొత్తగడి రైల్వేట్రాక్ వద్ద గేట్ లేకపోవడంతో వికారాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వెళ్తున్న కారును రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందారు. తదనంతరం స్పందించిన సంబంధిత శాఖ అధికారులు రైల్వే గేట్‌ను ఏర్పాటు చేశారు.
కేంద్రానికి పట్టని జిల్లా ప్రజల కష్టాలు
ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో జిల్లాకు కేటాయింపుల విషయంలో ఎదురుచూపులే తప్పా ఒక్క రూపాయి కూడా విడుదల కావడం లేదు. ఎంఎంటీఎస్ వికారాబాద్ వరకు పొడిగింపుతోపాటు బుల్లెట్ రైలు తదితర ప్రాజెక్టులను పెండింగ్‌లో పెడుతున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనీసం రైల్వే బ్రిడ్జిలను కూడా నిర్మించేందుకు నిధులివ్వడం లేదు. రైల్వే బ్రిడ్జిలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో గేట్ పడితే 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
తాండూరు నుంచి వికారాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్‌ల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులున్నా బ్రిడ్జిలు లేకపోవడంతో రైల్వే గేట్ల వద్ద ఆగాల్సిన దుస్థితి ఉన్నది. అదేవిధంగా ధారూరు మండలంలోని తరిగోపుల సమీపంలో ఉన్న రైల్వే లైన్‌తో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. వంతెన లేకపోవడంతోపాటు కిలోమీటర్ మేర తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. వర్షాకాలంలో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా బషీరాబాద్ మండల కేంద్రంలోనూ రైల్వే బ్రిడ్జి లేకపోవడంతో కిలోమీటరు మేర తిరిగి బషీరాబాద్ ప్రభుత్వ కార్యాలయాలతోపాటు జీవంగి తదితర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
కేసీఆర్ పాలనలో సాఫీగా ప్రయాణం
బీఆర్ఎస్ హయాంలో ఎక్కడైతే వాగులు పొంగిపొర్లి రవాణా స్తంభించే అవకాశముందో ఆ ప్రాంతాలను గుర్తించి వంతెనలు నిర్మించి ప్రజల ఇబ్బందులను తొల గించింది. జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా నదులతోపాటు ఈసీవాగు ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వా గులు, మారుమూల పల్లెల్లోని వాగులపై రూ. కోట్లు ఖర్చు చేసి బ్రిడ్జిలను నిర్మించడంతో ప్రజలకు కష్టాలు తప్పి రవాణా సాఫీగా సాగుతున్నది. కేసీఆర్ హయాం లో 31 వంతెనల నిర్మాణానికి రూ. 142 కోట్లకుపైగా నిధులను వెచ్చించారు.
రైల్వే గేట్ పడితే అంబులెన్స్‌లకూ ఇబ్బందే..
రామయ్యగూడ రైల్వేగేట్‌తో వాహనదారులకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసర సమయంలో రోగులను తీసుకెళ్లే అంబులెన్స్ లు కూడా గేట్ పడితే అక్కడ ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది. రోజుకు పదు ల సంఖ్యలో రైల్వే గేట్ పడుతుండడంతో చుట్టు పక్కల కాలనీవారు, దూర ప్రాంతాలకు వెళ్లే వారు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలపాటు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతున్నది. రైళ్ల రాకపోకలూ పెరిగాయి. తరచూ రైల్వే గేట్ పడుతుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవాలి.
-ఎం.నాగయ్య, వికారాబాద్
కేంద్రం స్పందించి.. బ్రిడ్జిలు నిర్మించాలి..
వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ, అనంతగిరి రోడ్డు, గంగారం వెళ్లే దారుల్లో రైల్వే గేట్ ఉండడంతో.. రైళ్లు వచ్చి, వెళ్లే సమయాల్లో గేట్ వేస్తుండడంతో దాదాపుగా 20 నిమిషాల వరకు అక్కడ వాహనాలు ఆగాల్సి వస్తున్నది. అత్యవసరంగా వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు స్పందించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వంతెనలు నిర్మించాలి. -చంద్రశేఖర్, వికారాబాద్