Paraquat : భారత రైతాంగం పాలిట విషతుల్యంగా మారిన పారాక్వాట్(Paraquat) గడ్డిమందుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఎందరో రైతుల ప్రాణాలను బలిగొన్న ఈ హానికరమైన రసాయనం అమ్మకాలు నిలిపివేస్తూ మంగళవారం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే 70కి పైగా దేశాల్లో పారాక్వాట్ను నిషేధించగా మనదేశంలో మాత్రం ఈ గడ్డిమందు అమ్మకాలు యథేచ్చగా సాగాయి. అయితే.. ఇటీవల కాలంలో ఈ రసాయనం దుష్పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు.. వైద్యులు, వ్యవసాయ నిపుణుల అభ్యర్థించడంతో దిగొచ్చిన కేంద్రం ఎట్టకేలకు పారాక్వాట్ను నిషేధం విధించింది.
ప్రాణాంతకమైన పారాక్వాట్(పారక్వాట్ డైక్లోరైడ్)పై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. హానికరమైన ఈ గడ్డిమందు అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పారాక్వాట్ వినియోగంపై ఈ రోజు నుంచే (జూలై 14) దేశ వ్యాప్తంగా నిషేధం అమలులోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది.
The Centre on Tuesday issued a draft notification imposing a complete ban on paraquat, a deadly herbicide, with immediate effect. It is a ban that many toxicologists, doctors and agricultural experts would argue was years overdue. Despite being prohibited in more than 70… pic.twitter.com/Zdl9WpaCXt
— IndiaToday (@IndiaToday) July 14, 2026
కీటకనాశన చట్టం 1968, సెక్షన్ 27 ప్రకారం పారాక్వాట్ దిగుమతి, తయారీ, రవాణా, పంపిణీపై పూర్తి స్థాయిలో నిషేధం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో.. సదరు కంపెనీకి అభ్యంతరాలు, సూచనలు తెలియజేయడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. జూలై 13 నుంచి ఆగస్టు 13లోపు పారాక్వాట్ ఉత్పత్తి సంస్థ తమ స్పందన తెలియజేయాల్సి ఉంది.
గడ్డి మందుగా వాడకంలో ఉన్న పారాక్వాట్ ప్రాణాలు బలిగొంటుందని పలువురు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ గడ్డిమందు కారణంగా దేశవ్యాప్తంగా 6 వేలమందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని రికార్డులు చెబుతున్నాయి. టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ మందు కారణంగానే తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని, తక్షణమే దీన్ని బ్యాన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. అలానే.. ది మైఖేల్ జె.ఫాక్స్ ఫౌండేషన్ సైతం.. ఈ హానికర రసాయనానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. వీరితో పాటు వైద్యులు, వ్యవసాయ నిపుణులు సైతం నిషేధానికి పట్టుబట్టారు. దాంతో, పారాక్వాట్పై నిషేధానికి సంబంధించిన ఫైలుపై కేంద్ర వ్యవసాయ మంత్రి సంతకం చేశారని కిసాన్ టాక్ కథనం వెల్లడించింది.