హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనాభా గణన(సెన్సెస్ 2027) రెండో విడత ప్రక్రియకు సంబంధించి శిక్షణా షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు రెండో విడత జనాభా లెకల ప్రక్రియ (ఇంటింటి సర్వే) కొనసాగనున్నది. ఈ క్రమంలో తొలివిడత శిక్షణను ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా రెండో విడత శిక్షణా క్యాలెండర్ను ప్రకటించారు. రాష్ట్రంతోపాటు జనాభా గణన సూచిక తేదీని 2027 మార్చి 1గా నిర్ణయించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 2027 జనవరి 15వ తేదీ వరకు వివిధ దశల్లో కొనసాగనున్నది.
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ఎన్యుమరేటర్లకు విడతలవారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈసారి జనగణన పూర్తి డిజిటల్ పద్ధతిలో మొబైల్ యాప్ల ద్వారా నిర్వహిస్తున్నందున డిజిటల్ పరిజ్ఞానంపై (సాంకేతికత) పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ తలపెట్టారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ వాడకంలో తకువ అవగాహన ఉన్న సిబ్బందిపై ఈ రెండో విడత శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. రెండో దశలో అడిగే దాదాపు 40 ప్రశ్నల (లింగం, వయసు, చదువు, వృత్తి, మతం, కులం, మాతృభాష, వలస వివరాలు వంటివి) ఆధారంగా డాటాను ఎలా నమోదు చేయాలో సిబ్బందికి శిక్షణలో వివరిస్తారు.