న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ కుంభకోణం.. ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ కేసులో ఆ సంస్థ మాజీ సీఎండీ రిషి అగర్వాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. 28 బ్యాంకులను రూ.22,842 కోట్లు ముంచిందన్న ఆరోపణల్ని ఏబీజీ షిప్‌యార్డ్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎస్బీఐ ఫిర్యాదుతో ఈ నెల 7న కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఇటీవల రిషి అగర్వాల్‌ను ప్రశ్నించినట్టు సంబంధిత అధికార వర్గాలు గురువారం తెలిపాయి. అయితే ఎప్పుడు విచారించారన్న వివరాలను మాత్రం తెలియపర్చలేదు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు దేశం విడిచి పారిపోకుండా సీబీఐ లుకౌట్ నోటీసులనూ జారిచేసిన సంగతి విదితమే. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఈ నెల 12న 13చోట్ల సోదాలనూ చేసింది. ఈ సందర్భంగా కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.