Allu Aravind | పైరసీ పెద్ద నేరం. ‘తండేల్’ సినిమాను పైరసీ చేస్తున్న వెబ్‌సైట్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే మా హెచ్చరిక. అందరిపై కేసులు పెడుతున్నాం. మీరు జైలుకి వెళ్లే అవకాశం ఉంది’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లోనూ ప్ర
దర్శించారు. ఈ పైరసీ వ్యవహారంపై సోమవారం చిత్ర నిర్మాత బన్నీ వాసు, సమర్పకుడు అల్లు అరవింద్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘నిర్మాతలు, ఫిల్మ్ చాంబర్ తీసుకుంటున్న చర్యల వల్ల కొన్నేళ్లుగా పైరసీ ఆగిపోయింది. మళ్లీ రెండు నెలల నుంచి పైరసీ భూతం పడగ విప్పుతున్నది. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్ చాంబర్లో సెల్ ఏర్పాటు చేశాం. వాళ్లు పగలూ, రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తున్నారు. అయినా వాట్సాప్ గ్రూపుల్లో లింక్‌లను ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ గ్రూప్‌ల అడ్మిన్లను గుర్తించి వారి సమాచారాన్ని సైబర్‌క్రైమ్‌కు చేరవేశాం. వారందరిని అరెస్ట్ చేయిస్తాం’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ ‘పైరసీ విషయంలో కేసులు నమోదైతే వెనక్కి తీసుకోలేరు. ఇప్పుడున్న సాంకేతికత ప్రకారం అందరిని ట్రాక్ చేయొచ్చు. సైబర్ పోలీసులు వారిని సులభంగా పట్టుకుంటారు. పైరసీ చేసిన వాళ్లకి, దానిని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. కేబుల్ ఆపరేటర్లు ఎవరైనా ఒక్క క్లిప్ ప్లే చేసినా కేసులు పెడతాం’ అని హెచ్చరించారు.
‘తండేల్’ ఈవెంట్లో దిల్రాజును ఉద్దేశిస్తూ నేను సరదాగా అన్న మాటలు మెగా అభిమానులను బాధించాయి. దాంతో నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు. నేను ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కావవి. అయినా రామ్‌చరణ్ నాబిడ్డ లాంటివాడు. నా ఏకైక మేనల్లుడు. అతనికి నేను ఏకైక మేనమామను. నేనెందుకు అతన్ని తక్కువ చేస్తాను. యినా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.. ప్లీజ్..’ అని అల్లు అరవింద్ అన్నారు. ‘తండేల్’ వేడుకలో ‘ఒక సినిమా(గేమ్‌ఛేంజర్)ను కిందకు తీసుకెళ్లి, మరొకసినిమా(సంక్రాంతికి వస్తున్నాం)ను పైకి తీసుకెళ్లి.. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లని పిలిచి.. ఈ వారంరోజులు రకరకాలు చేశాడు..’ అంటూ దిల్‌రాజుతో తాను మాట్లాడిన మాటలు వివాదం కావడంతో అల్లు అరవింద్ పై విధంగా వివరణ ఇచ్చారు.