మసాచుసెట్స్ (అమెరికా), జూలై 2: క్యాన్సర్, ఎయిడ్స్ (హెచ్ఐవీ) లాంటి వ్యాధులను చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే నిర్ధారించుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి. ఇందుకోసం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు డిస్పోజబుల్ డీఎన్ఏ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. వ్యాధిని చాలా కచ్చితత్వంతో గుర్తించడంతోపాటు శీతలీకరణ (రిఫ్రిజిరేషన్) లేకుండానే కొన్ని వారాలపాటు మనగలగడం ఈ సెన్సర్ ప్రత్యేకత. సంప్రదాయ ల్యాబొరేటరీలకు మించి ఉపయోగించుకునేందుకు ఈ సెన్సర్ అనువుగా ఉంటుంది. సెన్సర్లు ‘క్రిస్పర్’ జీన్ ఎడిటింగ్ సిస్టమ్ (జన్యు సవరణ వ్యవస్థ) నుంచి డీఎన్ఏ-చాపింగ్ ఎంజైమ్‌ను ఉపయోగిస్తాయి.
క్యాన్సర్ సంబంధిత జన్యువు లాంటి లక్ష్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ ఎంజైమ్ క్రియాశీలమై గడ్డికోత యంత్రం (లాన్‌మోవర్) మాదిరిగా సమీపంలోని సెన్సర్ ఎలక్ట్రోడ్పై ఉన్న డీఎన్ఏని ముక్కలు చేయడం ప్రారంభిస్తుంది. ఈ అంతరాయం ఎలక్ట్రికల్ సిగ్నల్‌ను మార్చి వ్యాధి ఉనికిని వెల్లడిస్తుంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానంలో డీఎన్ఏ పూత త్వరగా క్షీణించడం వల్ల సెన్సర్లను ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసి, వాటిని శీతలీకరించాల్సి వచ్చేది.
దీంతో ఆ సెన్సర్ల వాస్తవిక ఉపయోగం చాలా పరిమితంగా ఉండేది. ఈ సమస్యను ఎంఐటీ పరిశోధకులు సాధారణ పాలిమర్ పూతతో పరిష్కరించారు. నిల్వ చేసిన తర్వాత కూడా తన పనితీరును ఏమాత్రం కోల్పోని ఈ సెన్సర్.. మూత్రంలో కనిపించే పీసీఏ3 (ప్రొస్టేట్ క్యాన్సర్ బయోమార్కర్)ను విజయవంతంగా గుర్తించింది. తయారీకి కేవలం 50 సెంట్లు (దాదాపు రూ.43) మాత్రమే ఖర్చయ్యే ఈ డిస్పోజబుల్ సెన్సర్లు వివిధ రకాల వ్యాధుల నిర్ధారణకు సులభమైన, చౌకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని ఎంఐటీ పరిశోధకులు చెప్తున్నారు.