వాషింగ్టన్: ఫేసియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు-ఎఫ్ఆర్) ఫీచర్‌ను తొలగించబోతున్నట్టు ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ (ప్రస్తుతం మెటా ప్లాట్‌ఫాం) సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే తమ ప్లాట్‌ఫాంపై ఉన్న కోట్లాది ఫేస్ప్రింట్స్ను సైతం తొలగించబోతున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయంతో చోటుచేసుకునే మార్పులు ఏంటి?
ఏమిటీ ఫేసియల్ రికగ్నిషన్?
ఫేస్బుక్లో అప్లోడ్ చేసే ఫొటోలు, వీడియోల్లోని వ్యక్తులను గుర్తించే సాంకేతికతే ‘ఫేసియల్ రికగ్నిషన్’. ఏదేని ఫొటోలోని ‘ఎక్స్’ అనే వ్యక్తి పేరు, ఇతర వివరాలను నమోదు చేసేలా ఆ ఫొటోలను పోస్ట్ చేసిన యూజర్‌కు తొలుత కొన్ని సందేశాలు వెళ్తాయి. ఒకవేళ ఆ యూజర్ ఆ వివరాలను నమోదుచేస్తే.. ఆ సమాచారాన్ని ఫేస్బుక్ భద్రపరుస్తుంది. ఇక అప్పటినుంచి.. ఫేస్బుక్లో ‘ఎక్స్’ వ్యక్తి ఉన్న ఫొటోలు లేదా వీడియోలు ఎప్పుడు పోస్ట్ అయినా.. ఆటోమెటిక్‌గా ఆ వ్యక్తి వివరాలు అందరికీ కనిపిస్తాయి.
ఎందుకు తొలగిస్తున్నది?
పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఫేస్బుక్లో ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతతో ప్రమాదం పొంచి ఉందంటూ ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే పలుదేశాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికత వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగానే ముఖ గుర్తింపు కోసం ఉపయోగించే టెంప్లేట్లను తొలగించబోతున్నట్టు పేర్కొంది. వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు తెలుస్తున్నది.
‘ఎఫ్ఆర్’ షట్‌డౌన్‌తో ఏమి జరుగబోతుంది?
‘ఎఫ్ఆర్’ సాంకేతికతను 2010లో ఫేస్బుక్ తీసుకొచ్చింది. ఫేస్బుక్ వాడుతున్న యాక్టివ్ యూజర్లలో మూడొంతుల మంది ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను తొలగిస్తే, 100 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లపై ప్రభావం పడనున్నట్టు అంచనా. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఫోటోలు, వీడియోల్లోని వ్యక్తుల ముఖాలను ఇకపై ఫేస్బుక్ దానంతట అది గుర్తించలేదు. ఫొటోల్లోని వ్యక్తిని సూచించడానికి, వారి పేరుతో ట్యాగ్ చేయడానికి ఇకపై వీలుపడదు. ఫొటోల్లోని వ్యక్తులు ఎవరు, వారి వివరాలు ఏమిటన్న విషయం కూడా ఇకపై ఎవరికీ తెలియబోవు. దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే ఆటోమెటిక్ ఆల్టర్నేటివ్ టెక్ట్స్ (ఏఏటీ)పై కూడా తాజా నిర్ణయం ప్రభావం చూపనున్నది. అలాగే, ఇప్పటికే భద్రపరిచిన కోట్లాది యూజర్ల ఫేస్ప్రింట్లను (ఫొటోలు, వీడియోల్లోని వ్యక్తుల పేరు, సమాచారం) తొలగించనున్నట్టు సంస్థ
ప్రకటించింది.