Canada School : కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల ఘటనలో తొమ్మిది మరణించారు. మృతుల్లో టీచర్, విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో మరో 25 మంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల అనంతరం నిందితురాలు అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఈ కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ట్రాన్స్ ఉమన్ అయిన జెస్సె వాన్ రూట్సీలర్గా గుర్తించారు.
ఆమె గురించి వివరాలు తెలుసుకోగా దిగ్భ్రాంతి కలిగే అంశాలు బయటపడ్డాయి. జెస్సె తను నాలుగేళ్లక్రితం చదువుకున్న స్కూల్లోనే కాల్పులు జరిపింది. స్కూల్లోకి రావడానికి ముందు వారి ఇంటిలో తన తల్లి (39)ని, అలాగే సవతి సోదరుడి (11)ని కూడా కాల్చి చంపినట్లు గుర్తించారు. మగవాడిగానే జన్మించిన జెస్సె ఆ తర్వాత ట్రాన్స్ ఉమన్‌గా మారింది. జెస్సె చాలా కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఆమెకు కౌన్సెలింగ్ కూడా జరుగుతోంది. పోలీసులు తరచూ ఆమె కోసం వారి ఇంటికి వెళ్తుండేవారు. అలాగే జెస్సెకు ఆయుధాల లైసెన్స్ కూడా ఉంది. ఇటీవలే లైసెన్స్ అయిపోవడంతో అధికారులు ఆమె దగ్గరున్న గన్స్ తీసుకున్నారు. అయితే, తర్వాత ఆమెకు గన్ తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. ఈ గన్‌తోనే జెస్సె కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
జెస్సె ఎవరినైనా ప్రత్యేకంగా టార్గెట్ చేసి కాల్పులు జరిపిందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతున్నట్లు స్థానిక పోలీస్ కమాండ్ మెక్ డొనాల్డ్ తెలిపారు. ఈ కాల్పుల ఘటన కెనడా చరిత్రలోనే అతిపెద్ద ఘటనల్లో ఒకటిగా నిలిచిందని పోలీసులు అంటున్నారు. కాల్పుల ఘటనతో కెనడా ప్రధాని తన విదేశీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. ప్రమాదంలో మృతులకు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించింది.