Hushar Pittalu Teaser | టాలీవుడ్ యువ నటులు అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ ఫిలింస్ విడుదల చేస్తుండగా. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ద్వారా ఈ సినిమా గురించి తెలిసిందని, సినిమా చూడగానే ఇది నేటి యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే రియలిస్టిక్ మూవీ అనిపించిందని ప్రశంసించారు. చిత్రంలోని నటీనటులందరూ అద్భుతంగా నటించారని, ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు బిక్షు మాట్లాడుతూ.. 16 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. తన నిజజీవితంలో చుట్టుపక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, యువతతో పాటు తల్లిదండ్రులు కూడా చూడాల్సిన ఒక బాధ్యతాయుతమైన కథను వినోదాత్మక శైలిలో రూపొందించానని తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థ ద్వారా సినిమా విడుదల కావడం తన అదృష్టమని పేర్కొన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసినప్పుడు తనకు షాకింగ్‌గా అనిపించిందని, ప్రథమార్థం యూత్‌ఫుల్‌గా ఉంటూనే ద్వితీయార్థంలో ఎంతో మెచ్యూర్డ్ కంటెంట్ ఉంటుందని చెప్పారు. కంటెంట్ నచ్చడం వల్లే సురేష్ బాబు ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్నారని, ఇది అందరిలో బాధ్యతను పెంచే చిత్రమని తెలిపారు.
హీరో అన్షు తాను మాసినపల్లి రవి పాత్రలో కనిపిస్తానని చెప్పగా, హీరోయిన్ వాసవి గణేషన్ తన తొలి చిత్రంలోని పాత్ర అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు చిన్ని చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమా తనను మాస్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, ఏడేళ్ల అనుభవంతో, కథపై నమ్మకంతో ఈ సినిమాను నిజాయితీగా నిర్మించామని, యువతకు మంచి సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. అన్షు, వాసవి గణేషన్‌తో పాటు గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, బలగం బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్-అర్జున్ సంగీతాన్ని అందించారు.