మునుగోడు మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తుర్కగూడెం, దుబ్బకాల్వ గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దాంతో గ్రామస్తులు అత్యవసర సమయంలో ఆస్పత్రికి, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కంకర రోడ్డే దిక్కు. ఇది వర్షాలకు గుంతలమయంగా మారడంతో ప్రయాణం నరకాన్ని తలపించేది. ఎట్టకేలకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పనుల పూర్తికి అధికారులు కృషిచేస్తున్నారు. నుంచి కొరటికల్ వరకు సుమారు 6.4కి.మీ దూరం ఉంది. ఈ మార్గంలో బట్లకాల్వ, లక్ష్మీదేవిగూడెం, తుర్కగూడెం, దుబ్బకాల్వ గ్రామాలు ఉన్నాయి. ఇది పూర్తిగా కంకర రోడ్డు కావడంతో రోజువారీ పనుల నిమిత్తం మునుగోడుకు రాకపోకలు సాగించాలంటే ఆయా గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పేవి కావు. అంబులెన్స్ వచ్చేందుకు సైతం రోడ్డు అనువుగా లేదు. ఈ నేపథ్యంలో ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ మార్గంలో బీటీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఎట్టకేలకు పీఎంజీఎస్వై కింద మార్చి నెలలో రూ.3.12కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కంకర, మట్టి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రహదారిపై వరదనీరు పారే ప్రాంతాల్లో రూ.44.56లక్షలతో 19కల్వర్టులు నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటికే 13 పూర్తయ్యాయి. బీటీ రోడ్డు పూర్తయితే కొరటికల్ గ్రామస్తులకు ఐదు కి.మీ కలిసొస్తుంది. కనగల్ మండలం రేగట్టె, నల్లగొండ మండలం నర్సింగ్భట్ల, చండూరు మండలం శిర్దేపల్లికి దూరం తగ్గనుంది.
కంకర రోడ్డు కష్టాలు తీరనున్నాయి
మునుగోడు నుంచి కొరటికల్కు వెళ్లాలంటే గూడపూర్ మీదుగా వెళ్లేవాళ్లం. దీంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. తుర్కగూడెం, దుబ్బకాల్వ మీదుగా దగ్గరి దారి ఉన్నప్పటికీ రోడ్డు గుంతలమయంగా ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో బీటీ రోడ్డు నిర్మిస్తుండటంతో కంకర రోడ్డు కష్టాలు తీరనున్నాయి.
70శాతం పనులు పూర్తయ్యాయి
మునుగోడు-కొరటికల్ బీటీ రోడ్డు పనులు 70శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం కంకర, మట్టి పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక బీటీ పనులు ప్రారంభిస్తాం. ఇటీవల స్టేట్ మానిటరింగ్ అధికారులు రోడ్డు నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే మార్చిలోగా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పనులను ముమ్మరం చేశాం.