ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 5: ముస్లిం మహిళలను అసభ్యకరంగా చిత్రించిన బుల్లిబాయ్ నిందితులను కఠినంగా శిక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ విభాగం హెడ్ ప్రొఫెసర్ అన్సారీ డిమాండ్ చేశారు. ‘బుల్లిబాయ్’ పేరుతో ముస్లిం మహిళలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ అన్సారీ మాట్లాడుతూ ప్రేమను పంచాలని, విద్వేషాన్ని కాదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో స్త్రీలు పోస్ట్ చేసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారికి ధరలు నిర్ణయించి వేలానికి పెడుతున్నట్లు పేర్కొనడం దారుణమన్నారు. పైగా ఆ మహిళల గురించి నీచమైన కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ది వైర్ రిపోర్టర్ ఇస్మాత్ ఆరా, రేడియో జాకీ సైమా, జర్నలిస్ట్ అయేషా మిన్హాజ్, కాంగ్రెస్ కార్యకర్త హసీబా అమీన్ వంటి ఎందరో ప్రముఖులు ఈ దాడికి గురయ్యారని అన్నారు.
కొంతమంది మైనర్లు సైతం బాధితులుగా మారారని వివరించారు. తెలంగాణలోనూ ఖలీదా పర్వీస్ అనే సామాజిక కార్యకర్త కూడా బాధితురాలేనని చెప్పారు. కేవలం వీళ్లంతా ముస్లిం మహిళలు అవడంతోనే టార్గెట్ చేశారని ఆరోపించారు. వారంతా బీజేపీ హిందూత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నందున వేధింపులకు గురి చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి వారికి కల్పించిన హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు యాకుబ్ షేక్, హుస్సేన్, మొయినుద్దీన్, రహమాన్, రాజు, మహమ్మద్ అవద్, సల్మాన్, నజీర్, అహ్మద్, హైదర్, అజహర్, అంజద్, అమీర్ షరీఫ్ పాల్గొన్నారు.