చిగురుమామిడి, జూన్ 17 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ముద్దసాని రమేష్ మంగళవారం బదిలీ కాగా, మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద బీఎస్పీ మండల శాఖ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి నృత్యాలు చేశారు. చిగురుమామిడి మండల చరిత్రలోనే ఇలాంటి తహసీల్దార్ ఎప్పుడు రాలేదని అన్నారు. భూమి రిజిస్ట్రేషన్లు, ఇండ్ల పర్మిషన్లకు, నాలా కన్వెన్షన్ కు ప్రతి పనికి డబ్బులు ఇవ్వనిదే పనులు కావని, పనులను జాప్యం చేస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పుకునేవాడని ఆరోపించారు.
తహసీల్దార్ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని దొంగ పట్టాలు చేస్తున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం వివిధ పనులపై వెళితే మీరు ఎందుకు వచ్చారు.. చిన్న చిన్న పనులకు మీరు వస్తే ఎట్లా అంటూ వ్యంగంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని పలువురు ఆరోపించారు. అనేక గ్రామాల్లో వ్యక్తిగతంగా ఏజెంట్లు పెట్టుకొని వారి ద్వారా డబ్బులు తీసుకొని పనులు చేసేవాడని విమర్శలు ఉన్నాయి.
తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది కూడా విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీఎస్పీ కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జ్ బోయిని బాబు, నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రాజు, చిగురుమామిడి మండల అధ్యక్షుడు ఎనగందుల శ్రావణ్ కుమార్ నాయకులు జేరిపోతుల వెంకటేష్, ములుగురి సతీష్ తదితరులు పాల్గొన్నారు.