KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి అది ఏమైనా నీ అయ్య సొమ్మా..? నీ అబ్బ సొమ్మా..? అని కేటీఆర్ నిలదీశారు. ప్రజల సొమ్మును ప్రజలకు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గల్లాపట్టి యూసుఫ్‌గూడ నడి బజార్లకు గుంజి మీ పైసలు ఇప్పించే జిమ్మేదారి మాది అని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కొంతమంది ఆకురౌడీలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని బెదిరిస్తున్నారాట. గెలవ్వక ముందు ఇన్ని నకరాలు ఇస్తున్నారు.. పొరపాటున గెలిస్తే ఈ నేరచరిత్ర వారు మనల్ని బతకనిస్తారా..? భర్తను కోల్పోయిన మాగంటి సునీతను ఓడగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 250 కోట్లు ఖర్చు పెట్టిందడు. షేక్ పేటలో 6 వేలు, యూసుప్‌గూడలో 5 వేలు, ఎర్రగడ్డలో 4 వేలు, బోరబండలో 6 వేలు ఇంటింటికి పంపుతున్నాడు. గమ్మత్తు ఏంటంటే ఈ డబ్బుల్లో కూడా కిందిస్థాయి నేతలు కమీషన్లు కొట్టి 2 వేలు ఇచ్చారట. ఈ పైసలు నాలుగు రోజుల్లో అయిపోతాయి.. వీటి కోసం ఆలోచించొద్దు.. మీ జీవితం గురించి ఆలోచించండి అని కేటీఆర్ సూచించారు.
కాంగ్రెస్ ఓడిపోతుందని సర్వేల్లో తేలేసరికి 14 మంది మంత్రులు తిరుగుతున్నారు. సీఎం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నడు.. ఇవాళ మీట్ ది ప్రెస్ పెట్టి ఆయన ఫ్రస్టేషన్ అంతా తీసుకుంటుండు. జూబ్లీహిల్స్‌లో గెలిచినా, ఓడినా 2034 దాకా ఆయనే సీఎం అట. రాసిపెట్టుకోండి కాంగ్రెస్ ఉంటంది అంటుండు. నువ్వు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి.. నవంబర్ 14న జూబ్లీహిల్స్ కొట్టే దెబ్బతో నీకు ఏమైతదో, నీ కుర్చీ ఉంటదో, ఊడిపోతదో యాదిపెట్టుకో. రేవంత్ రెడ్డి ఇచ్చే నాలుగు వేలు, ఆరు వేలకు ఆశపడితే మీరే మోసపోతరు గోస పడుతరు. రెండేండ్ల కింద మోసపోయాం.. ఇప్పటికే అవస్థలు పడుతున్నాం. కుక్కర్లు పంచుతున్నారట. చీరలు పంచుతున్నారట. పైసలు పంచుతున్నారట.. ప్రభుత్వాన్ని నడిపితే సీదా కొట్లాడు.. ఆ దమ్ము లేదు.. దిగజారి పోయి మాట్లాడుతున్నడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.