KTR | అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి.. వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి.. తర్వాత అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేలా కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు డిక్లరేషన్ల పేరుతో ప్రతి ఒక్క మాటను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు. అయితే 1000 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఆ పార్టీ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, అవినీతి, అరాచకాల పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.
రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా విధానాలు, వైఫల్యాలు, అవినీతి, అరాచకాలను ప్రజల ముందుంచాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో ప్రతి వర్గానికి అర్థమయ్యేలా వివరించేందుకు సెప్టెంబర్ 2 నుంచి భారీ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమాలు కేవలం హామీల చుట్టూ కాకుండా.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు.
ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల తాలూకు బకాయిలను మరోసారి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెలా ఇస్తామన్న ఆర్థిక సహాయం ఎంత మేరకు పేరుకుపోయిందో ఈ బాకీ కార్డుల ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రతి వర్గానికి ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరిగిన వైఫల్యాలు, ఆయా వర్గాలకు రావాల్సిన ప్రయోజనాలు, బకాయిల వివరాలను ప్రజల ముందుంచాలని సూచించారు.
విద్యార్థులకు రూ.12 వేల కోట్లకు పైగా ఫీజులు చెల్లించకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును అన్ని కాలేజీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను ప్రజల్లో విస్తృతంగా చర్చకు తీసుకురావాలని సూచించారు. యువతకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వకుండా, హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందో ఇప్పటికే సరూర్‌నగర్‌లో నిర్వహించిన సభ, యువ సంగ్రామ సదస్సు ద్వారా ఎండగట్టామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి సంబంధించిన కార్యాచరణలో భాగంగా మరోసారి యువతకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఆటో డ్రైవర్లు, ఆడబిడ్డలు, అన్నదాతలు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని వారికి అర్థమయ్యేలా వివరించాలని కేటీఆర్ సూచించారు. ఒకే తరహా కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆయా వర్గాల సమస్యలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఏడు రోజ్లపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గాల్లో మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, దళితులు, బీసీలు, గిరిజనులు తదితర వర్గాలను ప్రత్యేకంగా కలుస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. హామీలు మాత్రమే కాకుండా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను కూడా కార్యక్రమాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు.
కేవలం హామీలు అమలు కాలేదనే అంశానికే పరిమితం కాకుండా.. ఈ 1000 రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రంగాల్లో వైఫల్యం చెందిందో, ఎన్ని రంగాల్లో అట్టర్‌ఫ్లాప్ పరిపాలన సాగించిందో ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలను గుర్తించి వాటిపై ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని సూచించారు.
“కేవలం హామీలు మాత్రమే కాదు.. వంద రోజుల వైఫల్య పాలన, వంద రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంత అట్టర్‌ఫ్లాప్ అయిందో కూడా మనం చాలా పెద్ద ఎత్తున లేవనెత్తాల్సిన అవసరం ఉంది” అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, వాస్తవంగా జరిగిన పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
కొత్త తరం పిల్లలకు చేరువయ్యేలా ఈ కార్యక్రమాలు ఉండాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. సోషల్ మీడియాను ఒక పదునైన అస్త్రంగా ఉపయోగించుకుని వినూత్నమైన కార్యక్రమాలు, ప్రచార రూపాలతో కాంగ్రెస్ వైఫల్యాలను కొత్త తరానికి చేరేలా చేయాలని కోరారు.
వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు సహా అన్ని స్థాయిల నాయకులు పాల్గొనాలని కేటీఆర్ సూచించారు.ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రం, గ్రామం, వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులన్నీ కదిలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలను ఎంత వినూత్నంగా నిర్వహించగలిగితే అంత వినూత్నంగా నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివిధ రూపాల్లో, వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు తమ చాతుర్యాన్ని ఉపయోగించాలని కోరారు.