29న అట్టహాసంగా దీక్షాదివస్
అది చరిత్రను మలుపుతిప్పిన రోజు.. కేసీఆర్‌ను 2009లో అరెస్ట్ చేసిన అలుగునూరులో భారీ బహిరంగ సభ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు
- గంగుల, కొప్పుల, వినోద్, జీవన్‌రెడ్డి, రమణ, రసమయి వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమనేత కేసీఆర్ దీక్షకు దిగిన నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షాదివస్‌ను ఈసారి కూడా అట్టహాసంగా నిర్వహించనున్నామని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం వారు మీడియాతో మాట్లాడి కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
2009 నవంబర్ 29న కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని అలుగునూరులో ఈ నెల 29న భారీ బహిరంగసభ నిర్వహిస్తామని రసమయి బాలకిషన్ తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఆయనకు ఇప్పటికే ఆహ్వానం అందించామని వెల్లడించారు. నవంబర్ నెల అనగానే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష గుర్తుకొస్తుందని చెప్పారు. దీక్షతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ నాడు బాటలు వేశారని గుర్తుచేశారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని, అల్గూనూర్లో నిర్వహించనున్న దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
అకుంఠిత దీక్షతో రాష్ట్ర సాధన: వినోద్‌కుమార్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న సందర్భంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి దీక్షకు దిగారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. తాము వద్దని వారించినా ఆయన ముందుకు నడిచారని పేర్కొన్నారు. 1969లో తొలి దశ ఉద్యమాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాశవికంగా అణచివేశారని, సీమాంధ్రులు కుటిల రాజకీయాలు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ నేతృత్వంలో మలిదశ పోరాటం ఉధృతంగా సాగిందని, ఈ తరుణంలో కేసీఆర్ కుకునూరుపల్లిలో దీక్ష చేయాలని నిర్ణయించి కరీంనగర్ నుంచి దీక్షాస్థలికి వెళ్తుండగా అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో యావత్తు తెలంగాణ ఒక్క తాటిపైకి వచ్చిందని, అనంతరం ఖమ్మం జైలులో కేసీఆర్‌ను నిర్బంధించారని తెలిపారు. ఆ తర్వాత నిమ్స్‌కు తరలించాలని తాము డిమాండ్ చేశామని వివరించారు. నాడు తెలంగాణ మొత్తం సబ్బండవర్గాల ఆందోళనలతో అట్టుడికిందని పేర్కొన్నారు.
కేసీఆర్ దీక్షతోనే చిదంబరం ప్రకటన: జీవన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతోనే అప్పటి కేంద్రం హోంమంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారని మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పునరుద్ఘాటించారు. ఈ నెల 29న అల్గూనూర్లో నిర్వహించనున్న బహిరంగసభకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ దీక్షతోనే కేంద్రం తెలంగాణ ఇచ్చింది: ఎల్ రమణ
యూపీఏ కామన్ మినిమమ్ పోగ్రాంలో తెలంగాణనే చేర్చకపోవడాన్ని కేసీఆర్ నాడు వ్యతిరేకరించారని ఎమ్మెల్సీ ఎల్ రమణ గుర్తుచేశారు. క్యాబినెట్ నుంచి బయటకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశారని చెప్పారు. ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం దిగొచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రవీందర్‌సింగ్, చిరుమళ్ల రాకేశ్‌కుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పార్టీ నేతలు రవీందర్‌రెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
చరిత్రలో ప్రత్యేకస్థానం: కొప్పుల ఈశ్వర్
కేసీఆర్ దీక్షకు దిగిన నవంబర్ 29 రోజు చరిత్ర ఉన్నంత కాలం గుర్తుంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నాడు కేసీఆర్ గళం విప్పారని చెప్పారు. దీక్షాదివస్ గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సాధించుకొన్న తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం పై తుపాకీ పట్టుకొని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
చరిత్రను మలుపుతిప్పిన రోజు: గంగుల
ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు దిగిన నవంబర్ 29 చరిత్రను మలుపుతిప్పిన, 40, 50 ఏండ్ల దారిద్య్రాన్ని వదిలించుకున్న రోజు అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అరెస్ట్ సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తుచేసుకొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేయకుంటే ఢిల్లీ సర్కార్ దిగివచ్చేదే కాదని స్పష్టంచేశారు. ఈ నెల 29న అలుగునూరులో బహిరంగసభతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఘనంగా సంబురాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇది కేవలం బీఆర్ఎస్కు సంబంధించిన వేడుక కాదని, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలందరిదని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉన్నంతకాలం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కారకుడైన కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

