హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): అధికారాన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చేసిన అడ్డగోలు దోపిడీపై రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. సీఎం కుటుం బ సభ్యుల దోపిడీపై మూడు రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో బయటపెట్టిందని పేర్కొన్నా రు. ‘నువ్వు, నీ కుటుంబసభ్యులు అధికారాన్ని అడ్డంపెట్టుకొని చేసిన అడ్డగోలు దోపిడీపై సమాధానమేది? మెడికవర్ హాస్పిటళ్ల మాటున రూ. 13,200 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకు న్న వ్యవహారంపై మౌనమెందుకు? నీ సతీమణి పేరిట ఉన్న ఐదు హ్యుందాయ్ షోరూమ్‌లపై స్పం దించడంలేదెందుకు.
దవాఖానల్లో నీ అల్లుడి వాటాల సంగతేంది? నీ సోదరుడు కొండల్‌రెడ్డి కంపెనీకి కేటాయించిన భూముల మాటేంది? నీ బిడ్డ కడుతున్న ఇంటర్నేషనల్ స్కూళ్ల దందా ఏంది?’ అని రేవంత్‌ను ఉద్దేశించి కేపీ వివేకానందప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత క్రిశాంక్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుం టే, అసెంబ్లీ విప్‌గా అడుగుతున్నానని, సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. మూడేండ్లుగా రేవంత్‌రెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, నాడు దక్షిణ కొరియా టూర్‌కు వెళ్లింది మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం కాదని, తన భార్య చేత హ్యుందాయ్ షోరూమ్‌లు పెట్టించేందుకేనని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నదని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి అన్నదమ్ములు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారని వివేకానంద దుయ్యబట్టారు. చివరికి హైదరాబాద్‌లో లక్కీభాస్కర్ లాం టి హోటళ్లను కూడా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రెండేండ్ల క్రితం నష్టాల్లో ఉన్న మెడికవర్ దవాఖాన రూ.13,200 కోట్ల లాభాలెలా ఆర్జించిందో అంతుచిక్కడం లేదని, ఇంటర్నేషనల్ స్కూళ్లు పెట్టేందుకు రేవంత్‌రెడ్డి బిడ్డకు రూ.కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో తెలియడంలేదని పేర్కొన్నారు.
రేవంత్ తమ్ముడి షెల్ కంపెనీకి రావిర్యాలలో రూ.200 కోట్ల ప్రభుత్వ భూమిని రూ.7 కోట్లకే కేటాయించడంలోని మర్మమేందని ప్రశ్నించారు. మరో తమ్ముడు జగదీశ్‌రెడ్డికి చెందిన స్వచ్ఛ్ బయో కంపెనీకి వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని అప్పగించడంలో దాగి ఉన్న వ్యవహారమేందని నిలదీశారు. బీఆర్ఎస్ సంధిస్తున్న ప్రశ్నలకు 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
రేవంత్ అవినీతిని నోట్ చేసుకుంటున్నామని వివేకానంద పేర్కొన్నారు. అవినీతి చిట్టా రాస్తే బుక్కులే నిండిపోతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సం ధించారు. సీఎం అవినీతిపై రాష్ట్రపతి జోక్యం చేసుకొని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.