నాంపల్లి, అక్టోబర్ 1 : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తున్నదని, ఈ ప్రాజెక్టును కొనసాగించాలని ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. రైతుల పంటలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండ జిల్లా నాంపల్లి విద్యుత్తు ఏడీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ.. కరెంటు లేక పంట పొలాలు ఎండిపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ధ్వజమెత్తారు. కాంట్రాక్టుల కోసమే మంత్రి పదవి కావాలని ఢిల్లీలో చకర్లు కొడుతున్నాడని మండిపడ్డారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా మునుగోడు నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదనిని ధ్వజమెత్తారు. డిండి ప్రాజెక్టును రద్దు చేయాలన్న హరగోపాల్, కోదండరాం తదితరులు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏడీ కార్యకర్తలతో ఏడీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో గీత కార్మిక సహకార సంఘం మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.