వేములవాడ, అక్టోబర్ 1: విద్యుత్తు సమస్యలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలలో తాగునీటి కటకట ఏర్పడింది. ఈ రెండు మున్సిపాలిటీలకు వేములవాడ అర్బన్ మండలం మారుపాక ఫిల్టర్ బెడ్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నది. సిరిసిల్లకు 95 లక్షలు, వేములవాడకు 85 లక్షల లీటర్లను నిత్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. పంప్‌హౌసుల్లో మొత్తం మూడు మోటర్లు ఉండగా, రెండు మోటర్లు నిర్విరామంగా పనిచేస్తుంటాయి. అత్యవసర పరిస్థితులలో వినియోగించేందుకు ఒకటి అందుబాటులో ఉంచారు.
ఇటీవల పెరిగిన విద్యుత్తు వినియోగం, గ్రామాల్లో వ్యవసాయానికి ఉదయం మాత్రమే సరఫరా కావడం, ఒకేసారి అందరూ వినియోగించడం ద్వారా కరెంట్ హెచ్చుతగ్గులతో బుధవారం మోటర్లు కాలిపోయాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఒకేసారి రెండు మోటర్లు కాలిపోవడంతో మున్సిపాలిటీల్లో నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఒకే మోటర్‌ను రన్ చేస్తుండగా, ఒకరోజు ఒక మున్సిపాలిటీ, మరొక రోజు ఇంకో మున్సిపాలిటీకి సరఫరా చేస్తున్నారు. తక్షణమే మోటర్లను మరమ్మతులు చేసేందుకు హైదరాబాద్ తరలించామని, రెండు మూడు రోజుల్లో సరఫరాను పునరుద్ధరిస్తామని ఏఈ మధు తెలిపారు. ఒక మోటర్తో ప్రస్తుతం విడతలవారీగా రెండు మున్సిపాలిటీలకు నీటి సరఫరా జరుగుతుందని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా మున్సిపాలిటీల అధికారులకు సూచించామని తెలిపారు.