బాన్సువాడ, జూన్ 28: రేవంత్ రెడ్డి పోలీసుల పహారాలో పాలన సాగిస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ‘సర్’ను ప్రవేశపెట్టి .క్రిస్టియన్, ముస్లిం ఓట్లను గల్లంతు చేసే అవకాశం ఉన్నదని తెలిపారు. తమకు అనుకూలంగా లేనిచోట్ల ఓటర్లను తొలగిస్తున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజానీకానికి రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని బుడ్డర్ ఖాన్ రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసిన రైతులను యూరియా యాప్ పేరిట తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల అవసరం మేరకు యూరియా సొసైటీల్లో అందుబాటులో ఉండేదని గుర్తుచేశారు. రేవంత్ పాలన యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో ప్రజాహంతకుడిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు మంజూరుచేసిందని తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని, అడిగింది ఇచ్చారని, అడుగనిది కూడా ఇచ్చారని గుర్తుచేశారు. ఉమ్మడి జిల్లాకు వచ్చే నిధుల్లో 50శాతం నిధులు పోచారంపై గౌరవంతో ఇచ్చాడని తెలిపారు. అలాంటి గొప్పనాయకుడు కేసీఆర్ను పోచారం మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోచారం మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తున్నాడని వారి మనుషులు చెప్పుకుంటున్నారని, అది ఎట్టిపరిస్థితుల్లో జరగదని, ఎవరు రానివ్వరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొరం అక్రమ దందా జోరుగా సాగుతున్నదని, కొంత మంది ఇందిరమ్మ ఇండ్ల పేరిట బిల్లులు మెక్కుతున్నారని ఆరోపించారు.