Rajasthan | జైపూర్: రాజస్థాన్ పోలీస్ సర్వీస్ (RPS)లో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా దివ్య మిట్టల్ పనిచేసేవారు. 2023లో మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. కానీ ఈ కేసును అధికారికంగా మూసివేస్తున్నట్లు బుధవారం ఏసీబీ వెల్లడించింది.
ఏమిటీ కేసు
ఈ కేసు 2021 నాటిది. రాజస్థాన్‌లోని జైపూర్, అజ్మీర్ ప్రాంతాల్లో డ్రగ్స్ దందాపై అజ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దృష్టి సారించింది. ఈ గ్రూప్‌నకు దివ్య మిట్టల్ నాయకత్వం వహించారు. ఈ స్పెషల్ గ్రూప్ అప్పట్లో సుమారు రూ. 16 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో హరిద్వార్‌కు చెందిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతడి పేరును తొలగించి, అరెస్ట్ కాకుండా చేసేందుకు దివ్య రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంలో సుమిత్ అనే కానిస్టేబుల్ మధ్యవర్తిగా వ్యవహరించి రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి విడతగా రూ. 25 లక్షలు చెల్లించాల్సి ఉంది.
ఈ విషయం తెలిసిన ఏసీబీ అధికారులు లంచానికి సంబంధించిన ఆడియోను (Audio) రికార్డు చేశారు. దివ్యను పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఆమెకు ఈ విషయం తెలియడంతో వారి ప్లాన్ సక్సెస్ కాలేదు. కానీ ఆడియో రికార్డుల ఆధారంగా ఏసీబీ అధికారులు 2023, జనవరి 16న దివ్యను అరెస్ట్ చేశారు. మార్చిలో హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆమెపై దాఖలు చేసిన 11,500 పేజీల చార్జిషీట్‌ను చూపించి విచారణ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు హైకోర్టుకు విన్నవించారు. కానీ ఈ కేసుకు సంబంధించి బలమైన సాక్ష్యాలు లేవని వారి విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఏసీబీ ఈ కేసును అధికారికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.