వెంగళరావునగర్, ఫిబ్రవరి 16: ‘ నీ భార్యని నాతో పంపించేయ్..ఆవిడ నాక్కావాలి. ఆవిడని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. ఎన్నాళ్ళని మీ ఇంట్లోనే ఉండిపోను?..మీ ఆవిడని నాకు ఇచ్చేస్తే హాయిగా మా జీవితం మేము బతుకుతాం’ ఆవిడ భర్తతో తెగేసి చెప్పాడో ప్రియుడు. ‘నీకేమైనా మతిగాని పోయిందా.. నా పెళ్ళాన్ని ఇచ్చేయమని నన్నే అడుగుతావా’ అంటూ ప్రియురాలి భర్త ప్రశ్నిస్తూ గొడవ పడ్డారు. ‘భార్యాపిల్లల నుంచి దొరకని ప్రేమ, సంతోషం మీ ఆవిడతో లభిస్తుంది. ఆమెని దూరం చేస్తే తట్టుకోలేను’ అని చెప్పాడా ప్రియుడు. చివరకు ఇక ఆవిడ తనకు దక్కదేమోనన్న ఆవేదనతో ఆ ప్రియుడు వ్యథ చెంది ప్రియురాలి ఇంటి ఎదుట ఐదు లీటర్ల పెట్రోల్ శరీరం పై పోసుకుని నిప్సంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని యాదగిరినగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఆనందపురానికి చెందిన 34 ఏండ్ల వయసున్న దంపతులు సినిమాలపై మక్కువతో నాలుగేళ్ళ క్రితం నగరానికి వచ్చారు. జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ యాదగిరినగర్ లో నివాసం ఉంటున్నారు. మహిళ సమీప గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సూర్యనారాయణ( 43) ఆరేళ్ళ క్రితం వీరికి పరిచయమయ్యాడు.
ఐదు రోజుల క్రితం ఆయన ఏకంగా సదరు మహిళ ఇంటికే సూర్యనారాయణ వచ్చాడు. వాళ్ళింట్లోనే ఉంటున్నాడు. తన భార్య, కొడుకు, కూతురు తనని పట్టించుకోవడం లేదని వారితో చెప్పి బాధపడేవాడు. కూతురికి పెళ్లి చేసి పంపానని.. తండ్రిపై ఆమెకు ప్రేమ లేదని .. ఆమెతో చెప్పుకుంటూ బాధపడేవాడు. కాగా, సదరు మహిళను సత్యనారాయణ తన ప్రియురాలిగా భావించేవాడు. ఆమె మాట్లాడే మాటలు అతనికి సాంత్వన నిచ్చేవి. శనివారం రాత్రి మద్యం తాగిన మత్తులో ఇంటికి వచ్చిన సూర్యనారాయణ తన మనస్సులో ఉన్నదంతా దంపతుల ముందే చెప్పేశాడు. ‘మీ ఆవిడ అంటే నాకు ప్రాణం.. ఆవిడ నా గుండె. ఆమె లేకపోతే నేనుండలేను. నాకు మీ ఆవిడ కావాలి.
అవిడ్ని నాకిచ్చెయ్..నాతో పంపించు.. జీవితాంతం సంతోషంగా ఉండేలా మీ అవిడ్ని నేను చూసుకుంటా’ అని ప్రియురాలి భర్తతో అన్నాడు. ‘నా పెళ్ళాన్ని ఇవ్వమని నన్నే అడుగుతావా’ అంటూ సదరు మహిళ భర్త అందుకు నిరాకరించాడు. ఆ రాత్రి ప్రియురాలి ఇంట్లోనే నిద్రించిన అతను తెల్లవారు జామున యూసుఫ్ గూడ పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంకుకు వెళ్లి.. రూ .500 పెట్రోల్ ని కొనుగోలు చేసి.. పెట్రోల్ క్యానుతో ఇంటికి చేరాడు. ప్రియురాలి ఇంటి ముందు తన శరీరంపై క్యాన్ లోని పెట్రోల్ అంతా పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలతో గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.