నల్గొండ : జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ( Ministers ) అసమర్థులేనని ( Incompetent ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) ఆరోపించారు. జిల్లాకు సీఎం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, నిధుల సాధనలోనూ జిల్లా మంత్రులు విఫలం చెందారని దుయ్యబట్టారు.
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన (SIR), పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు ప్రతి రోజు బీఎల్వోతో పాటే ఇల్లులు తిరుగుతూ అన్ని పరిశీలించాలని సూచించారు.అందరి ఓట్లు కాపాడేలా పకడ్బందీగా పని చేయాలని,అనుమానం వస్తే వెంటనే ఆర్డీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయాలని సూచించారు.

ఈ నెల 17న పెద్ద స్కామ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్నాడని తెలిపారు. హ్యాంరోడ్లు అన్ని వట్టివేనని, కమిషన్ల కోసమే హంగామా సృష్టిస్తున్నారని విమర్శించారు. కోతల వెంకట్ రెడ్డి ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు అడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నల్గొండకు వచ్చిన ప్రతిసారి నిధులిచ్చి అభివృద్ధి చేశారని , మెడికల్ కాలేజీలు, భగీరథ పథకం, రూ.1300 కోట్లతో నల్గొండ పట్టణం అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
అయితే ఇద్దరు మంత్రులు స్కామ్ లు, మిల్లర్ల వద్ద మూడుపులు తీసుకుంటూ చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.పోయేలా ఉన్న మంత్రి పదవిని కాపాడుకునేందుకు కోమటిరెడ్డి రేవంత్‌ను కాకా పెట్టేందుకు సభ పెడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.తన తమ్ముడికి పదవి వచ్చి తన పదవి పోయేలా ఉందని,అందుకే హడావుడి చేస్తూ షో పుటప్ చేస్తున్నారని విమర్శించారు.
ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాల జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, డా.గాదరి కిశోర్ కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,కంచర్ల కృష్ణారెడ్డి , బూత్ లెవల్ ఏజెంట్ లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.