Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికల నేపథ్యంలో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రానున్న గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది . ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఈ రాత్రి వేళల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో విస్తృతంగా కాకుండా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి వేళల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపాయి.
మరోవైపు హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈరోజు పగటిపూట అంతా దాదాపు పొడి వాతావరణమే నెలకొనగా.. రాత్రి సమయంలో నగరంలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. నిన్న నగరంలో కురిసిన భారీ వర్షంతో పోలిస్తే, ఈ రాత్రి కురిసే వర్ష తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని, కాబట్టి నగరవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.