ముంబై, జనవరి 20 (నమస్తే తెలంగాణ): పుట్టినప్పటి నుంచి తండ్రితో కలిసి నివసించని బిడ్డకు తల్లి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కమిటీని ఆదేశించింది. పిటిషనర్ పుట్టకముందే అతని తల్లిదండ్రులు విడిపోయారు. అందువల్ల ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లితోనే నివసిస్తున్నాడు. తండ్రికి అతని పెంపకంలో ఎటువంటి ప్రమేయం, సహకారం లేదు. ఆ బిడ్డ తండ్రి మధ్యప్రదేశ్‌కు చెందినవాడు. తల్లి మహారాష్ట్ర నివాసి. ఇద్దరూ లోహర్ కులానికి చెందినవారు. అయినప్పటికీ లోహర్ సమాజం రెండు రాష్ట్రాల్లోనూ సంచార తెగలు (ఎస్టీ) వర్గంలోకి వస్తుంది. 2021లో తన తండ్రి కుల రుజువును సమర్పించడంలో విఫలమైనందున భండారా కుల ధృవీకరణ కమిటీ ఆ బాలుడికి లోహర్ కుల చెల్లుబాటు ధృవీకరణ పత్రాన్ని (క్యాస్ట్ వ్యాలిడిటీ సర్టిఫికెట్) ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ఆ బాలుడు నాగ్‌పూర్ బెంచ్‌లో ఈ నిర్ణయాన్ని సవాలు చేశాడు.