హీరోలు 40 ఏళ్లు దాటినా ఇంకా లవర్ బాయ్స్లా నటించడం తప్పేమీ కాదని అంటున్నది బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్. వాళ్లు పాటలు పాడాలి, డ్యాన్సులు చేయాలి కాబట్టి అలా కనిపించేందుకు యువ నాయికలతో కలిసి నటిస్తున్నారని చెబుతున్నది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన నట ప్రయాణం సాగిస్తున్న మాధురీ ఇటీవల ‘ఫేమ్ గేమ్’ వెబ్ సిరీస్లో కనిపించింది. ఆమె తాజాగా మరో వెబ్ సిరీస్ ‘మజా మా’లో నటించింది.
ఈ సిరీస్ వచ్చే నెల 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నది. ఈ నేపథ్యంలో మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ…‘ఇవాళ చిత్ర పరిశ్రమలో కథలు, కథ చెప్పే విధానంలో మార్పులు వచ్చాయి. అలాగే ప్రేక్షకులు వైవిధ్యమైన కంటెంట్ ఇష్టపడుతున్నారు. నాతో పాటు రవీనా టాండన్, జుహీ చావ్లా లాంటి తారలంతా ఈ మార్పును అంగీకరిస్తూ కొత్త తరహా సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటిస్తున్నాం. స్టార్ హీరోలు ఇంకా లవర్ బాయ్స్లా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. కమర్షియల్ చిత్రాల్లోనూ పరిణితి వచ్చింది. హీరోలకు అలా కనిపించడం తప్పదు, ఇందులో వాళ్ల తప్పేం లేదు’ అని చెప్పింది.