BlinkIt : ఆన్లైన్ రిటైల్ ప్లాట్‌ఫాం బ్లింకిట్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది. ప్రమాదకర కత్తులు అమ్మినందుకుగాను ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. అలాగే బ్లింకిట్ స్టోర్స్‌లో ఉన్న అలాంటి 55 బటన్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు. బ్లింకిట్ సంస్థ నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటివి ఇంటికి డెలివరీ చేస్తుందనే సంగతి తెలిసిందే. ఈ ప్లాట్‌ఫాంపై ఏ వస్తువు అమ్మాలన్నా అది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. కానీ, వాటిని పక్కనబెట్టిన బ్లింకిట్ ప్రమాదకర కత్తుల్ని ఆన్లైన్లో అమ్మింది.
వాటిని కొన్న కస్టమర్లలో ఇద్దరు రెండు మర్డర్లు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధలన ప్రకారం 7.62 సెంటీమీటర్ల పొడవు, 1.72 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న కత్తుల్ని మాత్రమే అమ్మాలి. ఒకవేళ అంతకంటే పెద్ద కత్తులు వంటివి అమ్మితే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం. అయితే, బ్లింకిట్ అమ్మిన బటన్ చాకు / బటన్ కత్తి 8 సెంటీమీటర్ల పొడవు, 2.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. వీటిని ఫోల్డబుల్ లేదా పాకెట్ నైఫ్స్ అని కూడా అంటారు. కానీ, నిబంధనల కంటే ఇవి పెద్దవిగా ఉన్నాయి. అందుకే వీటి విషయంలో పోలీసులు చర్యలకు దిగారు. ఢిల్లీ పరిధిలో ఇటీవల జరిగిన మర్డర్స్‌లో రెండు కేసుల్లో నిందితులు తాము హత్య చేసేందుకు కత్తుల్ని బ్లింకిట్‌లో ఆర్డర్ చేసినట్లుగా చెప్పారు. వెంటనే ఆ కత్తుల్ని పరిశీలించగా, రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో పోలీసులు కస్టమర్లలాగా బ్లింకిట్ నుంచి రెండు కత్తుల్ని ఆర్డర్ చేశారు. ఒక్కో కత్తి ధర రూ.699. వాటిని రిసీవ్ చేసుకున్న ఢిల్లీ పోలీసులు బ్లింకిట్‌పై కేసు నమోదు చేశారు.
అంతేకాదు.. బ్లింకిట్ స్టోర్లపై దాడి చేసి 55 కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఇటీవల బ్లింకిట్ 10 మినట్ డెలివరీ ఫీచర్‌పై కూడా నెటిజన్లు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కూడా బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థలకు ఈ విషయంలో సూచనలు చేసింది. 10 మినట్ డెలివరీ తీసేయాలని సూచించింది. అయితే, బ్లింకిట్ మాత్రం దీన్ని పూర్తిగా తొలగించనట్లు తెలుస్తోంది. కానీ, గతంలో 30,000 ఉత్పత్తులు ఇలా అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 10,000 ఉత్పత్తుల్ని మాత్రమే 10 మినట్ డెలివరీ కింద అందిస్తోంది.