Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీని అవమానించేలా మిమిక్రీ చేయడంపై బీజేపీ మండిపడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీది కుసంస్కారం అంటూ విమర్శిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛత్రోంకి గూంజ్ అనే కార్యక్రమం జరిగింది.
దీనికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌తో కలిసి రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీని అనుకరించారు. ఇటీవల మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఒక వృద్ధ మహిళతో మోదీ మాట్లాడినట్లుగా.. ఆ మిమిక్రీ కళాకారుడు మోదీని అనుకరించాడు. దీనిని అక్కడే ఉన్న రాహుల్ గాంధీ ప్రోత్సహించారు. అలా, మోదీని అనుకరించడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జోకర్ల పార్టీలా తయారైందంటూ బీజేపీ విమర్శిస్తోంది. ఇది దిగజారుడు రాజకీయం అని విమర్శిస్తోంది.
Shameful and disgusting! Rahul Gandhi and the Congress party have stooped to an absolute nadir of moral bankruptcy. Weaponising a student interaction to mock and insult the late mother of PM Shri @narendramodi ji reveals a shocking lack of basic human empathy and political… https://t.co/hkyliBuYMy
— Pralhad Joshi (@JoshiPralhad) September 19, 2026
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు బీజేపీ అగ్రనేతలు రాహుల్ తీరుపై మండిపడుతున్నారు. ప్రధాన మంత్రి మోదీ దివంగత తల్లిని అవమానించం సిగ్గు చేటు అని పుష్కర్ సింగ్ ధామి విమర్శించారు. తల్లిని రాజకీయాలకు వాడుకోవడం, నాగరిక సమాజంలో అంగీకారయోగ్యం కాదని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ కూడా రాహుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వృద్ధురాలైన తల్లిని వేదికపై అవమానిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ వేదికపై నవ్వడం అత్యంత సిగ్గుచేటు చర్య అని ఆయన విమర్శించారు. ఇలాంటి కుసంస్కార పనుల వల్ల రాహుల్ గాంధీ యువతకు దగ్గరవ్వలేకపోతున్నారని విమర్శించారు. డీయూఎస్‌యూ ఫలితాల్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి చెందిన అనేకమంది అగ్రనేతలు, మంత్రులు రాహుల్ తీరుపై మండిపడుతూ విమర్శలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.