సూర్యాపేట : కులాల పేరుతో, మతాల పేరుతో విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలకు తెర లేపుతున్నది. ఆ ఉచ్చులో తెలంగాణ సమాజం పడొద్దని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17 న జరుపుకునేది ముమ్మాటికీ జాతీయ సమైక్యత దినోత్సవమేనని ఆయన స్పష్టం చేశారు.
చరిత్ర తెలియని వారు వక్రీకరించి చెప్పే బాష్యాలు మనలో మనకు తగవులు పెట్టేందుకే నని ఆయన చెప్పారు. ఈ నెల 17 న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున సమైక్యత ర్యాలీని నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని యస్.వి డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం పి.యస్ ఆర్ సెంటర్లో ర్యాలీ ముగింపు సందర్భంగా జరిగిన సభలో మంత్రిమాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా ప్రతీక అన్నారు.
అది యావత్ భారతదేశానికి చాటి చెప్పేందుకే సీఎం కేసీఆర్ స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు.
హిందు, ముస్లిం, క్రిస్టియన్ లు ఇక్కడ సోదర భావంతో కలిసిపోయారని ఆయన చెప్పారు.
కలిసి ఉంటేనే పురోగతిని సాధించవచ్చు అని గట్టిగా నమ్మే వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. విడిపోయినప్పుడే విదేశీయులు భారతదేశం మీద దండ యాత్రలు కొనసాగించారన్నారు.
జాతీయ సమగ్రతకు తెలంగాణ మార్గదర్శనం కావాలి అన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్న పూర్ణమ్మ, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.