హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో మొండిగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎంపీలు పది రోజులపాటు ఆందోళన చేసినా, కేంద్రం స్పందించలేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ చర్యలతో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ గనగోని శ్రీనివాస్, దన్నపనేని రవి, కోర్ కమిటీ సభ్యుడు కాండ్ర భగవాన్ పాల్గొన్నారు.