ప్రత్యేకరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘అమరజీవి’. కణ్మణి దర్శకుడు. కూచిపూడి రాజేంద్రప్రసాద్ నిర్మిస్తున్నారు. పాటల రికార్డింగ్‌తో సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పొట్టి శ్రీరాములు మనవరాళ్లు శ్రీమతి రేవతి, అనురాధ మాట్లాడుతూ ‘ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తాతయ్య శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని, పోరాటాన్ని ఈ సినిమా ద్వారా నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పం నెరవేరాలి’ అని తెలిపారు. తెలుగువాడికి గుర్తింపును తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పొట్టి శ్రీరాములు జీవితంలోని ముఖ్యఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమా ఇది’ అని తెలిపారు. వెనిగళ్ల రాంబాబు రచించిన ‘తెలుగే మన ఆత్మబలం..’ అనే పాటను సోమవారం రికార్డ్ చేశామని, సాలూరి వాసురావు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకరాభరణం రాజ్యలక్ష్మి, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మల్లిఖార్జున్ నారగాని.