హైదరాబాద్ : తెలంగాణ టూరిజం అంబాసిడర్గా బిగ్బాస్ ఫేం ఆలేఖ్య హారిక నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ ఆమె నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ విషయాన్ని అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తెలంగాణకు చెందిన మహిళ, బిగ్బాస్ ఫేం, దేతడి ఆలేఖ్యను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్’గా నియమించాం అని ఉప్పల శ్రీనివాస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఆల్ ది వెరీ బెస్ట్ హారిక. ఈ పాత్రకు వన్నె తెస్తావని ఆశిస్తున్నానని ఆలేఖ్య హారికను ఉప్పల శ్రీనివాస్ అభినందించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేఖ్ హారికను తెలంగాణ టూరిజం అంబాసిడర్గా నియమించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. బిగ్బాస్-4 కార్యక్రమంతో అభిమానులను సంపాదించుకున్న ఆలేఖ్య హారిక.. దేతడి అనే యూట్యూబ్ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి దగ్గరైంది. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఆలేఖ్య హారికకు నియామక పత్రాన్ని ఉప్పల శ్రీనివాస్ అందజేశారు. వివిధ వేదికలపై తెలంగాణలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి యూట్యూబర్ సేవలను టీఎస్టీడీసీ ఉపయోగించుకుంటుంది.
బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో మొదటి ఐదుగురు పోటీదారులలో అలెఖ్యా హరిక ఒకరుగా నిలిచారు. మొదటి ఐదు స్థానాల్లో రేసు నుంచి ఎలిమినేట్ అయిన మొదటి వ్యక్తి హారిక. తమకా మీడియా మద్దతుతో తన యూట్యూబ్ ఛానల్ దేతడి ద్వారా తాను పొందిన అభిమానులతో హారికా బిగ్బాస్ ఇంట్లోకి ప్రవేశించింది. యూట్యూబ్ చానల్లో ఆమెకు సుమారు 1.60 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆలేఖ్య తన తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించినందుకు సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నది.
23 ఏండ్ల హారిక.. బిగ్బాస్-4 తో పాటు పలు తెలుగు టీవీ షోలలో కూడా కనిపించింది. ఆలేఖ్య హారికకు ముందు తెలంగాణ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా నియమితులయ్యారు.