Bigg Boss | తెలుగు ప్రేక్షకులకు ‘శ్రీ సత్య’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయవాడ అమ్మాయిగా మిస్ విజయవాడ టైటిల్ గెలిచి, మిస్ ఆంధ్రా పోటీల్లో మెరిసి ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ప్రయాణం చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది. స్వభావానికి పూర్తిగా ఇంట్రోవర్ట్ అయినప్పటికీ ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాననే విషయాన్ని తాజాగా ఆర్జే కాజల్‌తో జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో ఓపెన్‌గా వెల్లడించింది. తన కెరీర్ ఆరంభానికి ప్రధాన కారణం తన ఫేవరెట్ హీరో రామ్ పోతినేనినే అని సత్య చెప్పింది. “రామ్ గారు 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చారు. అది చూసి నేను కూడా ఇంటర్ తర్వాత చదువు ఆపేసి సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పాను. ఆ సమయంలో అమ్మ చాలా కోపపడింది, నాతో మాట్లాడడం కూడా మానేసింది. కానీ నాన్న మాత్రం నన్ను ఎంకరేజ్ చేశారు” అంటూ తన మనసులోని మాటలను పంచుకుంది.
టీవీలో మిస్ విజయవాడ పోటీల ప్రకటన చూసిన తండ్రే ముందుగా ప్రయత్నించమని చెప్పారని తెలిపింది. దాదాపు 300 మంది పాల్గొన్న ఆడిషన్లో తాను సెలక్ట్ కాను అనే నమ్మకం తనకు ఉందని, కానీ హాస్టల్‌కు తిరిగి వెళ్లిన తర్వాత సెలక్ట్ అయ్యానని ఫోన్ రావడం తన జీవితంలో కీలక మలుపు అని చెప్పింది. చివరకు 11 మందిలో విజేతగా నిలవడంలో తన సమాధానాలే కారణమని, ఆ రోజు గెస్ట్‌గా ఉన్న శివాజీ గారు తన జవాబులు నచ్చడంతో విన్నర్‌గా ప్రకటించారని గుర్తు చేసుకుంది. వ్యక్తిగత జీవితంపై కూడా సత్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటి అంజలి కుమార్తె ధాన్వితో తనకు ఏర్పడిన అనుబంధం గురించి మాట్లాడుతూ, చిన్న పిల్లలంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. “మన చుట్టూ చాలా మంది పిల్లలు ఉన్నప్పుడు మనకంటూ ప్రత్యేకంగా పిల్లలు ఉండాల్సిన అవసరం ఏముంది?” అనే తన ఆలోచనను వెల్లడించింది.
అయితే తాను అమ్మ అవ్వాలని మాత్రం కోరుకుంటున్నానని, పెళ్లి చేసుకోకుండానే దత్తత ద్వారా ఓ అమ్మాయిని తీసుకుంటానని స్పష్టంగా చెప్పింది. మగ పిల్లాడిని మాత్రం తాను హ్యాండిల్ చేయలేనని సరదాగా వ్యాఖ్యానించింది. ధ్యానం, నమ్మకాల విషయానికి వస్తే, ఇటీవల శివ మాల, భైరవ మాల ధరించడం వెనుక బలమైన కారణం ఉందని చెప్పింది. ఓ ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న తర్వాత తన జీవితంపై దృష్టి మారిందని, అప్పటి నుంచే శివ మాల ధరించాలనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. “ఆడపిల్ల భైరవ మాల వేస్తావా అని చాలామంది అడిగారు. కానీ నేను నిష్టతో వేసుకున్నాను” అని చెప్పింది. ప్రస్తుతం శ్రీ సత్య ‘బీబీ జోడి 2’లో పాల్గొంటూ అర్జున్ కళ్యాణ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సాధారణ అమ్మాయిగా మొదలైన ఆమె ప్రయాణం, తన ఆలోచనలు, నిర్ణయాలు ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాయి.